Kalvakuntla kavitha: చిన్న చిన్న పదాలతో అల్లిన అద్భుతం వల్లంకి తాళం రచన..!
ABN, First Publish Date - 2022-12-25T20:55:51+05:30
35 వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శించిన ఎం.ఎల్.సి కల్వకుంట్ల కవిత.
వల్లంకి తాళం పుస్తకం తెలంగాణ కవి, గోరటి వెంకన్న రచించారు. ఈ పుస్తకం 2019 నవంబర్ 6న విడుదల అయింది. అడవి అందాన్ని, ప్రత్యేకతను వల్లంకి తాళం రచనలో కవితాత్మకంగా వివరించారు కవి గోరేటి వెంకన్న. వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2022 హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈనాటి కార్యక్రమంలో 35 వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శించారు ఎం.ఎల్.సి కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా వల్లంకి తాళం కవితా సంపుటి పై చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని తన అభిప్రాయాన్ని తెలిపారు.
పుస్తక ప్రదర్శనలో ఉన్న వివిధ స్టాల్స్ ను ఆమె ఆసక్తిగా తిలకించారు. పిల్లల పుస్తకాలు, సాహిత్యం, కథల పుస్తకాలను ఆమె కొనుగోలు చేశారు..ఆ తర్వాత కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న రాసిన వల్లంకి తాళం ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో ప్రస్తుతం ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్ననేపథ్యంలో కవులు, కళాకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి నుండి ఆ పరంపర కొనసాగుతుందని చెప్పారు. అనేక మంది గొప్ప కవులున్న వారసత్వన్ని తెలంగాణ పునికిపుచ్చుకుందన్నారు. వారు ప్రజల హృదయాలలో తరతరాలుగా గుర్తుండిపోయేలా రచనలు చేశారని, వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన అంతే అద్భుతంగా ఉందన్నారు. ఈ మట్టి, శ్రమ తత్వాన్ని అణువణువునా గోరేటి వెంకన్న తన రచనలో పొందుపరిచి కవిత్వంగా వ్రాసారని అన్నారు.
చిన్న చిన్న పదాలతో అడవి గురించి తన ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్భుతమైన అంశమన్నారు. గోరేటి వెంకన్నను ఉద్దేశిస్తూ.."మీరు పుట్టిన ఈ కాలంలో నేను పుట్టినందుకు గర్వంగా ఉంది", మీతో పాటు కౌన్సిల్ లో కూర్చోవడం సంతోషంగా ఉందిని" అన్నారు కవిత. ఈ ముఖా ముఖీలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్యక్షులు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ నాగేశ్వర రావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-25T22:37:12+05:30 IST