Jyoti Valaboju : వాళ్లకు మాట్లాడ్డం తప్ప చదవడం, రాయడం రాదు..
ABN, First Publish Date - 2022-12-22T16:59:36+05:30
సొంత డబ్బులతో వేసిన పుస్తకాలు మిగిలిపోతే, తక్కువధరకో, ఉచితంగానో ఇచ్చేసాను.
ఆమె రాతలు అక్షరాల అనుభవాల పోతలు. ఆమె వంటలు తెలంగాణ సాంప్రదాయానికి చిరునామాలు. జ్యోతి వలబోజు కథలు రాయడమే కాదు, వాటిని పుస్తకాలుగా మార్చే పనిలో స్త్రీగా ముందడుగు వేసింది. మంచి మాటతో తనతో పదిమందిని కలుపుకుంది. వాళ్ళలో ఉత్సహాన్ని నింపి, తానో పబ్లిషర్ గా నిలబడింది. సక్సెస్ అనేది కష్టపడనిదే అంతసులభంగా చేతికందదంటున్న జ్యోతి వలబోజుతో బుక్ ఫెస్టివల్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ అందమైన పలకరింపు.
1. తెలుగు పుస్తకాలు చదివేవారి సంఖ్య ఒకప్పటితో పోల్చితే తగ్గిందా.. పెరిగిందా? మీరేమంటారు.
అవును ఇప్పటి తరం తెలుగు పుస్తకాలు చదవడం తగ్గింది. అసలు వాళ్లకు మాట్లాడ్డం తప్ప చదవడం, రాయడం రాదు.. ఇప్పుడు పుస్తకాలు ప్రచురించేవారు పెరిగారు,. ఒక మంచి పట్టుచీర కొనే ధరలోనే పుస్తకం వేసుకోవచ్చు. పుస్తక ప్రచురణ చాలా సులువుగా మారింది.
2. కొత్త పుస్తకాల చోటును అనువాదాలు ఆక్రమిస్తున్నాయంటారా?
లేదు. ఎన్ని అనువాదాలు వచ్చినా, తెలుగు పుస్తకాలను చదివేవారు తగ్గలేదు.. అయినా ఆంగ్ల అనువాదాలు చదివేది ఎవరు? ఎంతమంది.. చాలా తక్కువే అంటాను నా అనుభవంలో... ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ వాళ్లు పుస్తకాలు చదవడం ఇష్టమైతే, అందునా తెలుగు కథలు, నవలలు చదవాలనే ఆసక్తి ఉంటేనే అనువాద పుస్తకాలు కొని చదువుతున్నారు.
3. పుస్తకాల ప్రచురణ లాభమైన వ్యాపారమేనంటారా?
స్త్రీ అయినా, పురుషుడు అయినా పుస్తకాల అమ్మకాలు పాఠకుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో నాకు మొదటి నుండి అంత లాభమేమీ రాలేదు. నేను రాసిన తెలంగాణా వంటల పుస్తకాలు తప్ప, నా సొంత డబ్బులతో వేసిన పుస్తకాలు సగం పైగా మిగిలిపోతే, తక్కువధరకో, ఉచితంగానో ఇచ్చేసాను.
4. మగవారితో పోల్చితే ఈ పుస్తకప్రచురణ రంగంలో కొనసాగడం అనేది కత్తిమీద సాములా అనిపించిన సందర్భలున్నాయా?
అస్సలు రాలేదు. ఏ రంగమైనా సరే, స్త్రీ తన హద్దులు తెలుసుకుని, ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోకుండా, ఇతరులను తన విషయాలలో జోక్యం కలిగించనీకుండా చేయాలి. తన పనేదో తను చేసుకుంటే అది కష్టమైనా ఇష్టంగా చేసుకోవడం వలన విజయాలు సొంతమే. నాకు ఈ పుస్తకప్రచురణ రంగంలో ఇంత పేరు తెచ్చుకోవడం కత్తిమీద సాము అస్సలు కాలేదు. రచయితలు, మిత్రులు, పుస్తకాల షాపులవాళ్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. సాయం చేసారు.
5. పుస్తకాల మార్కెట్ లో తెచ్చేప్పుడు మార్కెటింగ్ కష్టాలు ఎలా ఉంటాయి?
ఎన్నో సవాళ్లు, కష్టనష్టాలను ఎదుర్కొని పుస్తకాలను అందంగా తయారుచేసి మార్కెట్లోకి తీసుకువస్తుంటే వాటి అమ్మకాలు తగినట్టుగా జరగకపోతే చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా కవితల పుస్తకాలు.. అవి చదివేది తక్కువ మంది. అర్ధం అయ్యేది కూడా తక్కువమందికే.. అందుకే పాఠకులను ఏమీ అనలేము. కాని సాటి కవులు, రచయితలకు కూడా ఈ పుస్తకాలను కొని ప్రోత్సహిద్దామని అనుకోరు. దానివల్ల చాలామంది ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఒకోసారి అనిపిస్తుంది. ఎవరైనా ఎన్ని పుస్తకాలని కొనగలరు.
6. ఒకప్పటితో పోల్చితే ప్రచురణ సంస్థలు అదే స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్టు పెరగాయంటారా?
తెలుగులో ప్రచురణ సంస్థలు ఒకప్పుడు వెలుగు వెలిగాయి. అప్పుడు తక్కువమంది రచయితలు ఉండేవారు, చదివేవారు ఎక్కువే. ప్రచురణసంస్థవారు ఆయా రచయితల దగ్గర నుండి కథలు, నవలలు తీసుకుని ప్రచురించి, అమ్మి, రచయితలకు పారితోషికాన్ని ఇచ్చేవారు. ప్రస్తుతం రాసేవారు, అచ్చేయించుకునేవారు పెరిగారు, అప్పటి ప్రచురణ సంస్థలు అదే స్థాయిలో పెరగలేదు. వాళ్లకేం అవసరం అందరు రచయితల పుస్తకాలు ప్రచురించడానికి, అమ్ముడుపోతాయి అన్నవి తీసుకుంటారు. కాని .. తమ దగ్గర డబ్బు ఉండి, మంచి రచనలు ఉండి పుస్తకంగా తయారుచేసుకునే విషయాలు తెలీక, ఉన్న ఒకరిద్దరిమీద ఆధరాపడేవారు. ఇవన్నీ చూసిన నేను ఈ లోటును ఎందుకు పూడ్చకూడదు అనిపించింది. ముఖ్యంగా మహిళా రచయితలు. చాలామంది పెద్దవాళ్లు ఉన్నారు, వేరే ఊళ్లలో, వేరే దేశంలో ఉన్నావారికి పుస్తక ప్రచురణలో ఒకరికంటే ఎక్కువమంది మీద ఆధారపడాల్సి వస్తుంది.
ఇవన్నీ గమనించిన నేను, నాకు జీరో నాలెడ్జ్ ఉన్నా అడిగి తెలుసుకుంటూ, మీ దగ్గర రచన, సొమ్ములు ఉంటే చాలు, మీరు కోరినట్టుగా మీ పుస్తకాన్ని తయారుచేసిస్తాను అని రంగంలోకి వచ్చాను. ఒక మహిళగా సాటి మహిళా రచయిత్రులకు కూడా నా దగ్గర పుస్తకం వేయించుకోవడం అనుకూలంగా ఉంటుంది.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గను. తమ రచనలను ఒక అందమైన పుస్తకంగా తీసుకురావాలని ప్రతీ రచయిత కోరుకుంటారు. అది వారికి ప్రాణం. ఆ కోరిక, ఆ ప్రాణాన్ని మంచి క్వాలిటీ, ఎంతో అందంగా తయారుచేయడంలో నేను ఎక్కువ శ్రమిస్తాను. అంతే కాకుండా ప్రతీ పుస్తకం ప్రూఫ్ నేనే చూస్తాను. అందుకే 85% తప్పులుండవు అని హామీ ఇస్తాను. జాగ్రత్తగానే ఉంటాను కాని అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. కవర్ డిజైన్ విషయంలో కూడా రచయితకు సలహాలు ఇస్తాను. వాళ్లకు ఇష్టమైనట్టుగానే చేయిస్తాను.
అందుకే ఎంతోమంది రచయితలు నా గురించి “My Publisher” అని గర్వంగా చెప్పుకుంటారు. అదేవిధంగా నాలుగేళ్లు బుక్ ఫెయిర్ లో స్టాల్ పెట్టాను.. రచయితలకు ప్రచురణ విషయమై కొంతైనా కొరత తీర్చాననే అనుకుంటున్నా. 2014 లో ప్రారంభించిన నా జె.వి.పబ్లికేషన్స్ ద్వారా ఇప్పటివరకు వేర్వేరు సంస్థలు, రచయితలు, రచయిత్రులు ఫేస్బుక్ గ్రూప్స్ వాళ్ల పుస్తకాలు తయారయ్యాయి. ఇప్పటివరకు 250 పుస్తకాలు వచ్చాయి. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి పుస్తకాల ప్రచురణలో 2015 నుండి ఇప్పటివరకు దాదాపు 60 పుస్తకాలు చేసాను. వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి దాదాపు పదిహేను పుస్తకాలు చేసాను.. నా ఈ శ్రమను, ఎదుగుదలను గుర్తించిన తెలంగాణా రాష్ట్రప్రభుత్వం 2019లో ప్రచురణకర్తగా విశిష్ట మహిళా పురస్కారం ఇచ్చి సత్కరించింది.
7. ఆడవారిగా మీరు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెపుతారా?
ఇన్నేళ్లలో ఆడవారిగా ఎదుర్కున్న సమస్యలు, ఇబ్బందులు ఏమీ రాలేదు నాకు. ఎందుకంటే నా పనేదో నేను చేసుకుంటాను. రచయితకు కావలసినట్టుగా వీలైనంత తొందరగా పుస్తకం తయారు చేసివ్వడం వరకే నా పని. మిగతా పనికిరాని విషయాలజోలికి వెళ్లను. నిక్కచ్చిగా ఉంటాను.
8. కోవిడ్ అనంతరం పుస్తక ప్రచురణ రంగంలో అమ్మకాలు తగ్గిపోయి నష్టాలపాలయినవారున్నారు మరి మీ విషయం?
కోవిడ్ సమయంలో పుస్తకాల షాపులవాళ్లు, పెద్ద పెద్ద ప్రచురణకర్తలు చాలా సమస్యలను ఎదుర్కున్నారు. వాళ్ల దుకాణాలు మూసేసి, పనివారు తగ్గిపోయి నష్టాలపాలయ్యారు. రెండు సంవత్సరాలు పుస్తక ప్రదర్శన కూడా జరగలేదు. అది ఇంకా పెద్ద నష్టం. కాని నాకు అంత ఇబ్బందేమీ కలగలేదు. నేను ఎక్కువగా ఇంటినుండే పని చేస్తాను కాబట్టి కరోనా, లాక్డౌన్ సమయంలో కూడా పుస్తకాల పని ఆగలేదు. అంతకుముందు అన్నిపనులు ఫోన్లు, మెయిల్స్ మీద చేసుకున్నా, ప్రింటర్స్ కి డబ్బులివ్వడానికి మాత్రం వెళ్లేదాన్ని. కాని లాక్డౌన్ సమయంలో వాళ్లకు కూడా ఆన్లైన్ పేమెంట్ చేసాను. ఇంట్లో కూర్చునే ఎన్నో పుస్తకాలపని చేసాను. ఆ సమయంలో జరిగిన నష్టం మూలంగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ప్రింటింగ్ విషయంలో కూడా చాలా ధరలు పెరిగాయి.. అయినా పుస్తక ప్రచురణ డిమాండ్ తగ్గలేదు. అమ్మకాల విషయంలో ఎటువంటి ఆశ పెట్టుకోకుండా పుస్తకం వేసుకుంటున్నారు చాలామంది. J.V. అంటే డబ్బు, కంటెంట్ ఇచ్చేస్తే వాళ్ల పుస్తకాలు మంచి నాణ్యత, సరసమైన ధరతో తాయారు చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాను. హైదరాబాద్ అయినా ఇతర రాష్ట్రం, ఇతర దేశం అయినా పంపుతాను.
కోవిడ్ తరువాత ఇధి రెండవ పుస్తకాల ఎగ్జిబిషన్.. లాస్ట్ ఇయర్ బుక్ ఫెయిర్ సందడి తగ్గింది. అప్పటికి కరోనా భయం పూర్తిగా పోలేదు కాబట్టి, ఎప్పుడూ వచ్చే సందర్శకులు సగానికి సగం తగ్గిపోయారు. ఈసారి బుక్ ఫెయిర్ ఎప్పట్లా కళకళలాడుతుందనుకుంటున్నా, ఎందుకంటే ఎంతోమంది రచయితలు తమ పుస్తకాలను తీసుకొస్తున్నారు.
9. పాఠకుల ఇష్టాయిష్టాలు మారాయంటారా?
అవును పాఠకుల ఇష్టాయిష్టాలు మారాయి. రచయితల్లో మార్పు రావాలి. తమకు వచ్చిందే రాసి పుస్తకంగా వేస్తాము కొనుక్కోండి అంటే లాభం లేదు. మారుతున్న కాలంతోపాటు రచయితలూ మారారు. తాము రాసే అంశాలను పాఠకుల నాడిని బట్టి ఉండాలి. నేటి తరం పాఠకులకు కావలసినట్టుగా కథలు రావాలి. రాయాలి. అది ఇంకా వేగం పుంజుకోవాలి అనుకుంటున్నా.
10. మీ ప్రచురణ సంస్థ నుంచి ఈ సంవత్సరం ఎలాంటి పుస్తకాలు రాబోతున్నాయి?
నా ప్రచురణ సంస్థ భవిష్యత్ ఆలోచనలంటూ ప్రత్యేకంగా ఏమనుకోలేదు. ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త ఆలోచనలు, అవకాశాలకు అనుగుణంగా సాగుతూ ఉన్నాను. ఉదా. జె.వి పబ్లికేషన్స్ పేరుతో బుక్ ఫెయిర్ లో స్టాల్, కరోనా సమయంలో స్తబ్దుగా ఉన్న రచయిత్రులను కలగలుపుకుని 2021 లో 111మంది మూడు తరాల రచయిత్రులచే కథలు రాయించి “కథాకేళి” , 2022లో 175 మంది రచయిత్రులతో “ప్రియమైన నీకు” ఉత్తరాలు రాయించాను. ఈ సంవత్సరానికి 75 మంది స్త్రీలు, పురుష రచయితలతో “పిల్లలు చెప్పిన పాఠాలు” పుస్తకాన్ని తీసుకొస్తున్నాను. ఈ పుస్తకాలు ఎందుకూ అంటే మొన్న, నిన్న, నేటి తరానికి చెందిన రచయితలను ఒక తాటిమీదకు తీసుకురావడం. కొత్తవారిని ప్రోత్సహించి రాయించడం అనేది నా ముఖ్య ఉద్దేశ్యం. ఇది విజయవంతమైంది. ఇది నాకు చాలా సంతోషం కలిగించే విషయం. ఇలాటివే ఇంకా చేయాలని ఉంది. నా పుస్తకాలు అచ్చంగా తెలుగు స్టాల్ దొరుకుతాయి. నా కోసం కష్టపడి సాధించినదానికంటే, ఇతరులకు సాయం చేసి పొందే సంతృప్తి, ఆనందం ఎక్కువ అని నమ్ముతాను.
_ శ్రీశాంతి మెహెర్
Updated Date - 2022-12-22T17:29:42+05:30 IST