Babar Azam: బాబర్ ఆజం పాక్ ప్రధాని అవుతాడు: సునీల్ గవాస్కర్
ABN, First Publish Date - 2022-11-12T16:02:33+05:30
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోనే నిష్క్రమించాల్సిన స్థితి నుంచి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోనే నిష్క్రమించాల్సిన స్థితి నుంచి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్-పాక్ మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్‌లో ఏ జట్టు గెలుస్తుందన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ కనుక విజేతగా నిలిస్తే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం 2048 పాకిస్థాన్ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.
సూపర్-12 దశలో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన తర్వాత పాకిస్థాన్ ఆశలు అడుగంటాయి. అయితే, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లను ఓడించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు అదృష్టం కలిసి వచ్చింది. కీలక మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ తనతోపాటు ఆ జట్టును కూడా ఇంటికి తీసుకెళ్లింది. దీంతో పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
1992లో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు ఇదే వేదిక (మెల్‌బోర్న్)పై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 26 సంవత్సరాలకు ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సునీల్ గవాస్కర్ సరదాగా మాట్లాడుతూ.. ఆదివారం నాటి ఫైనల్‌లో పాకిస్థాన్ కనుక విజయం సాధిస్తే 26 ఏళ్ల తర్వాత 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడని సరదాగా వ్యాఖ్యానించాడు.
నిజం చెప్పాలంటే 1992 వన్డే ప్రపంచకప్‌కు, నేటి టీ20 ప్రపంచకప్‌కు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ తర్వాత పుంజుకుని ప్రపంచకప్ సాధించింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన స్థితి నుంచి ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే ప్రత్యర్థి, ఒకే వేదిక కావడం గమనార్హం.
1992 ప్రపంచకప్‌తో పోలికలు ఉన్నప్పటికీ ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం పేర్కొన్నాడు. ఇలాంటి పెద్ద వేదికపై జట్టును నడిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నాడు. గెలవడానికి 100 శాతం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. తమకు ఆరంభం గొప్పగా లేకపోయినా జట్టు గొప్పగా పుంజుకుందని, కుర్రాళ్లు పులుల్లా పోరాడారని బాబర్ ఆజం ప్రశంసించాడు.
Updated Date - 2022-11-12T16:27:28+05:30 IST