T20 World Cup Final: ఇంగ్లండ్-పాక్ ఫైనల్ మ్యాచ్‌కు వానగండం.. మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే ఏమవుతుంది?
ABN, First Publish Date - 2022-11-11T18:03:43+05:30
టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా ఆదివారం (13న) మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భాగంగా ఆదివారం (13న) మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోను, ఆ తర్వాత సూపర్-12 దశలోను కొన్ని మ్యాచ్‌లను తుడిచిపెట్టేసిన వరుణుడు ఫైనల్ మ్యాచ్‌కు కూడా అడ్డుతగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరగనున్న మెల్‌బోర్న్ (Melbourne)లో ఆదివారం వర్షం పడే అవకాశాలు 100 శాతం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. అంతేకాదు, 8 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే రిజర్వు డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే, సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు 95 శాతం వరకు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ రోజు కూడా 5 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకవేళ సోమవారం కూడా వర్షం పడి మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
మ్యాచ్ ప్రారంభమై మధ్యలోనే మ్యాచ్ ఆగిపోతే..
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే గ్రూప్ దశలో కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదే నాకౌట్ దశలో అయితే, కనీసం 10 ఓవర్లు ఆడాలి. ఈ నేపథ్యంలో సోమవారం రిజర్వు డే ఉన్నప్పటికీ వర్షం పడితే కనుక ఓవర్లను కుదించి ఆ రోజే టోర్నీని ముగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమై మధ్యలో వర్షం కారణంగా ఆగిపోతే, ఆ తర్వాతి రోజైన సోమవారం ఆట ఆగిన దగ్గరి నుంచి మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమై ఆ తర్వాత అంతరాయం కారణంగా ఓవర్లను కుదించాక కూడా ఆట తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేకపోతే ఆ రోజుకు మ్యాచ్ రద్దు అయినట్టే. రిజర్వు డే నాడు మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది.
అక్టోబరు, నవంబరులో ఆస్ట్రేలియాలో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. మెల్‌బోర్న్‌లో వర్షం కారణంగా మూడు సూపర్-12 మ్యాచ్‌లు రద్దయ్యాయి. వాటిలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇంగ్లండ్-ఐర్లాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించినా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విజయం సాధించింది.
Updated Date - 2022-11-11T18:08:23+05:30 IST