Delhi Liquor Scam : 100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర
ABN, First Publish Date - 2022-12-01T02:02:56+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టం చేసింది. ఇంతకాలం ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియాకు లీకులు ఇవ్వడం వరకే
ఢిల్లీ లిక్కర్ స్కామ్..
కవిత, ఎంపీ మాగుంట, శరత్‌రెడ్డిల నియంత్రణలో
ఉన్న సౌత్‌గ్రూప్ నుంచి ఆప్ నేతలకు చెల్లింపులు
ఈ స్కామ్‌లో వేర్వేరు ఫోన్లను వాడిన కవిత.. కేజ్రీవాల్ పీఏ కూడా ఫోన్లు మార్చారు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా నిందితులంతా ఫోన్లను ధ్వంసం చేశారు
ధ్వంసం చేసిన మొబైల్స్ విలువే 1.30 కోట్లు!.. శరత్‌కే సింహభాగం రిటైల్ జోన్లు
అమిత్ అరోరా అరెస్టు.. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన ఈడీ..
అమిత్‌కు వారం రోజుల కస్టడీ
ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. అక్రమంగా ఆర్జించేలా ఆప్ నేతలు లిక్కర్ పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే సౌత్‌గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయి. ఈ కంపెనీని నియంత్రిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్, మాగుంట, మరికొందరు ఉన్నారు. మనీలాండరింగ్ కోణంలో మేము చేసిన దర్యాప్తులో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయి.
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టం చేసింది. ఇంతకాలం ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియాకు లీకులు ఇవ్వడం వరకే పరిమితమైన ఈడీ వర్గాలు.. మొదటి సారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్ రిపోర్ట్‌లో కవిత రోల్ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు. అంతేకాదు.. ఇంతకు ముందు సమర్పించిన చార్జిషీట్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేరు లేకపోవడం, కవిత పాత్రను ప్రస్తావించకపోవడంతో కేసు మొత్తం మద్యం వ్యాపారులకే పరిమితమైందనే సందేశం వెలువడ్డా.. తాజా రిమాండ్ రిపోర్టులో మనీశ్ ఈ కుంభకోణానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. కవితతోపాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్‌సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని, అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి? ముడుపులు ఎవరెవరి చేతులు మారాయి? అనే విషయాలను వెల్లడించింది. అమిత్ అరోరా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది.
‘‘అమిత్ అరోరా ఓ హోల్‌సేల్ లిక్కర్ వ్యాపారి నుంచి రూ.2.5 కోట్ల ముడుపులు సేకరించారు. వాటిని దినేశ్ అరోరా ద్వారా ఆప్ నేత విజయ్ నాయర్‌కు అందజేశారు. అమిత్ అరోరా విచారణలో కవిత, శరత్, మాగుంట పాత్ర బయటపడింది. దొడ్డిదారిన కార్టెల్‌లను ఏర్పాటు చేయడం.. 12 శాతం మేర అసాధారణ స్థాయిలో హోల్‌సేల్, 180 శాతం మేర రిటైల్ వ్యాపారులకు లాభాలు చేకూర్చడమే ఢిల్లీ మద్యం పాలసీ లక్ష్యం. హోల్‌సేలర్స్‌కు చెల్లించే 12ు లాభాల్లో సగభాగాన్ని ఆప్ నాయకులకు ముడుపులు చెల్లించడానికే ఉపయోగించుకున్నారు’’ అని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో పెర్నాల్డ్ రికార్డ్ అనే అతిపెద్ద ఉత్పత్తిదారుకు దేశవ్యాప్తంగా 45 శాతం మార్కెట్ వాటా ఉందని, దాని డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని ఇండో స్పిరిట్స్‌కు అప్పగించేలా ఆప్‌కు చెందిన విజయ్ నాయర్ ఒత్తిడి చేశారని పేర్కొంది. దినేశ్ అరోరా, అమిత్ అరోరాతో కలిసి విజయ్ నాయర్ ఎల్1 లైసెన్సులను వదులుకునేలా(సరెండర్) కొంత మంది హోల్‌సెల్లర్లను, తమకు నచ్చిన హోల్‌సెల్లర్లను ఎంచుకునేలా ఉత్పత్తిదారులను ఒత్తిడి చేశారని వివరించింది. తమ ఇష్టం వచ్చిన వ్యక్తులకు భారీ లాభాలు అందేలా చూశారని ఈడీ స్పష్టం చేసింది. ఫలితంగా ప్రభుత్వం 12 శాతం మేర ఆదాయం.. అంటే రూ.581కోట్ల మేర నష్టపోయినట్లు వెల్లడించింది. ఆప్ నేతల జేబులు నింపేందుకు, హోల్‌సెల్లర్లు లాభాలు ఆర్జించేందుకు సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపుల ను భర్తీ చేసేందుకు ఈ మొత్తాన్ని వాడుకున్నారని ఆరోపించింది.
ఫోన్లు మార్చిన కవిత, మనీశ్
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, శరత్, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు తమ సెల్‌ఫోన్లను తరచూ మార్చారని ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆ తర్వాత ఆ ఫోన్లలో కొన్నింటిని ధ్వంసం చేసినట్లు.. ఈ 170 ఫోన్ల విలువ రూ.1.30 కోట్ల దాకా ఉంటుందని వివరించింది. ‘‘అమిత్ అరోరా ఒక్కడే తన ఫోన్లను 11 సార్లు మార్చారు. కవిత 6209999999 నంబరున్న ఫోన్‌ను 2021 డిసెంబరు 25 నుంచి 2022 ఏప్రిల్ 4 వరకు ఆరు సార్లు మార్చారు. 8985699999 నంబరు ఉన్న ఫోన్‌ను 2021 సెప్టెంబరు 1 నుంచి 2022 ఆగస్టు 22 వరకు నాలుగు సార్లు మార్చారు. సూదిని సృజన్ రెడ్డి 9000008288 నంబరు గల ఫోన్‌ను మూడుసార్లు.. శరత్ తన ఫోన్‌ను 9సార్లు మార్చారు. అభిషేక్ 9524567789 నంబరు గల ఫోన్‌ను ఐదుసార్లు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు 9849039635 నంబరుగల ఫోన్‌ను ఆరు సార్లు, ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ 9873900090 నంబరు కలిగిన ఫోన్‌ను ఐదుసార్లు మార్చారు. మనీశ్ సిసోడియా, ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లోత్, సమీర్ మహేంద్రుతోపాటు మొత్తం 36 మంది ఫోన్ల మార్చారు. వీరిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ కూడా ఉన్నారు’’అని వెల్లడించింది.
అమిత్ అరోరాకు వారం రోజుల కస్టడీ
లిక్కర్ స్కామ్‌లో బుధవారం అరెస్టు చేసిన అమిత్ అరోరాది కీలక పాత్ర అని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మహాదేవ్ లిక్కర్ కంపెనీ తన లైసెన్సును సరెండర్ చేసేలా ఆయన ఒత్తిడి చేశాడని పేర్కొంది. ఈ కేసులో అమిత్ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. రెండు వారాల కస్టడీకి అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరగా.. న్యాయమూర్తి వారం రోజుల కస్టడీకి అనుమతించారు. కాగా..కుంభకోణంలో ఏడుగురు నిందితులను చేరుస్తూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించే అంశంపై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది.
శరత్ చంద్రారెడ్డికే అధిక రిటైల్ జోన్లు
లైసెన్సులు మంజూరు చేసిన 32 రిటైల్ జోన్లలో సింహభాగం శరత్ చంద్రారెడ్డివే కావడం గమనార్హం. శరత్‌కు చెందిన అవంతికా కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్ లిమిటెడ్ ఐదు జోన్లను దక్కించుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు జోన్లకు దక్కించుకుంది.
Updated Date - 2022-12-01T07:46:19+05:30 IST