ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandur Sabha CM KCR : వడ్లు కొనడం చేతకాదు కానీ.. ఎమ్మెల్యేలను కొంటారా?

ABN, First Publish Date - 2022-10-31T05:29:08+05:30

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు పండించిన వడ్లను కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి ..

CM KCR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందల కోట్లు సంచుల్లో పెట్టుకొని వస్తారా?..

ప్రభుత్వాలను కూలగొట్టే అరాచకం ఎందుకు?

మోదీ అండదండలు లేకుండా బ్రోకర్లు వచ్చారా?

టీవీల్లో చూసింది కొంతే.. దొరికినోళ్లది చాలా ఉంది

త్వరలో ఢిల్లీ పీఠం దుమ్మురేపే పరిస్థితి వస్తుంది

ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరున్నారో తేలాలి

ఇలాంటి దుర్మార్గం చేసేటోళ్లు పదవికి అనర్హులు

మోదీ.. రెండుసార్లు ప్రధాని అయ్యావు ఇంకేం కావాలి?

చండూరు సభలో నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌

అంగట్లో సరుకులం కాదని ఎమ్మెల్యేలు నిరూపించారు

దేశ రాజకీయాలను మలుపు తిప్పేందుకే బీఆర్‌ఎస్‌

చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే వచ్చింది

ఒళ్లు మరచి ఓటేసి.. ఇల్లు కాలబెట్టుకోవద్దు: కేసీఆర్‌

మెయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటన తరువాత తొలిసారిగా

బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు.. చండూరు సభలో ప్రత్యక్షం

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ గుర్తుపై గెలిచారు?

వారిని దొడ్డి దారిన టీఆర్‌ఎ్‌సలో చేర్చుకోలేదా

రాజీనామాలు చేయించకుండానే మంత్రుల్ని చేశారు

ఫిరాయింపులకు కేరాఫ్‌ కల్వకుంట్ల కుటుంబం

బీజేపీలోకి వచ్చేవారిని బరాబర్‌ చేర్చుకుంటాం

అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే సీబీఐ

విచారణను అడ్డుకునే జీవో ఇచ్చారు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన ప్రయత్నాలపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు పండించిన వడ్లను కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి మొత్తుకున్నా కొనడానికి చేతకాని వారు.. వందల కోట్ల రూపాయలు సంచుల్లో పట్టుకొని ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉంటుందా? అంటూ మండిపడ్డారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం బంగారుగడ్డలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ నాయకత్వంపై, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘‘బీజేపీ నేతలు ఎందుకు చెలరేగుతున్నారు? వందల కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొని, ప్రభుత్వాలను కూలగొట్టే అరాచక వ్యవస్థను ఎందుకు తెచ్చారు? ఇది మంచిదా? నరేంద్రమోదీ నీకింకా ఏం కావాలి? ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా? ఒక్కసారి కాదు.. రెండుసార్లు నీకు అవకాశం వచ్చింది కదా? ఇంకా ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఇది సమాజానికి ఏ రకంగా మంచిది? ఎందుకు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారు?’’ అంటూ ధ్వజమెత్తారు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎ్‌సఎ్‌సలో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చారా? దుర్మార్గమైన పనిచేయటానికి బ్రోకర్లు ఎలా వచ్చారు? ఎక్కడినుంచి వచ్చారు? వారు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయి? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాలని, దీని వెనుక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హులు కాదని అన్నారు.

తలమాసినోడు ప్రమాణం అంటుండు..

‘‘ఎవడో ఒకడు తలమాసినోడు.. తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తవా? అంటడు. ఇంకొకడు పొడిబట్టలతోప్రమాణం చేస్తవా అంటడు. ఇది రాజకీయమా? ఢిల్లీ నుంచి వచ్చిరి. దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి. ఇప్పుడు జైల్లనే ఉండిరి. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని, రూ.100 కోట్లు ఇస్తామని, పార్టీ వదిలిపెట్టి రావాలని నలుగురు ఎమ్మెల్యేలకు ఆశచూపారు. మనోళ్లు వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవటం కాదురా! మేం అంగట్లో సరుకులం కాదు.. మేం తెలంగాణ బిడ్డలం అని తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తుకు ఎత్తారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడనని, కేసు న్యాయస్థానాల్లో ఉందని, తొందర్లోనే తేలుతుందని చెప్పారు. అయితే సూచనప్రాయంగా చెబతున్నానని, టీవీల్లో చూసింది కొంతేనని, దొరికిన దొంగలది చాలా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడతాయని, త్వరలోనే ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. ‘‘కేసీఆర్‌ గట్టిగా మాట్లాడుతున్నడని, వాని సంగతి చూడండని బ్రోకర్లను పంపించిండ్రు. 20-30 మంది ఎమ్మెల్యేలను కొని, ప్రభుత్వాన్ని పడగొట్టి, తెలంగాణను వశం చేసుకొని ప్రైవైటీకరణ చేయాలని ఆలోచిస్తున్నరు. ఇంత అరాచకం జరుగుతుంటే... మనం మౌనం పాటిద్దామా? ప్రతి పౌరుడు, యువకుడు, విద్యావంతుడు తీవ్రంగా ఆలోచించాలి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసీ బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప.. ఈ భారత దేశానికి నివృత్తి, నిష్కృతి లేదు’’ అని అన్నారు. మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు.. ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టే దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే దేశం బాగుపడదని పేర్కొన్నారు.

మునుగోడులో బీజేపీకి డిపాజిట్‌ రాకూడదు..

‘‘నా బలం, బలగం, నా శక్తి మీరే. మీ బలం చూసుకొనే కొట్లాడుతున్నాం. ఎవరికోసమైతే కొట్లాడుతున్నామో వాళ్లే సహకరించకపోతే మేమేం చేయగలం? వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేటోళ్లకు మునుగోడులో డిపాజిట్‌ వచ్చినా కేసీఆర్‌ ఎంత మొత్తుకున్నా మాకే ఓట్లు గుద్దిండ్లు! అంటరు. నన్ను పక్కకు జరిపేస్తరు. మునుగోడులో చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు. దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని దుర్మార్గం నరేంద్రమోదీ చేశారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ విధించి శిక్షిస్తున్నారు. అలాంటి బీజేపీకి చేనేత బిడ్డలు ఎలా ఓటేస్తారు? చేనేత కార్మికులు ఆలోచన చేయండి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిరావాలంటే, జీఎస్టీ వాపస్‌ తీసుకోవాలంటే.. చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెబుతోందని, కానీ.. ఏ రోజు కూడా 2.10 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయలేదని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప.. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు అన్నివర్గాలకు ఇవ్వడంలేదన్నారు. కేంద్రం అవలింబించే దుర్మార్గపు విఽధానాలు, కార్పొరేట్ల జేబులు, పెట్టుబడిదారుల ఖజానాలు నింపే పనులు, దుర్మార్గమైన ప్రైవేటీకరణ పాలసీతో కోట్లాది మంది ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు సంస్కరణల ముసుగులో వ్యవసాయ మోటార్లకే కాకుండా ఇళ్లలోని మోటార్లకు కూడా మీటర్లు పెడతామంటున్నారని, ప్రధాని మోదీ జారీచేసిన సర్క్యులర్‌లోనే ఇది ఉందని చెప్పారు. దీనిని ఒప్పుకొందామా? మీటర్లు పెడతామన్నోడి పీక నొక్కుదామా? ప్రజలు ఆలోచించాలని అన్నారు.

విశ్వ గురువా? విష గురువా?

‘‘దేశంలో సక్కదనం ఏముంది? పైనపటారం.. లోనలొటారం.. ఢంబాచారం. మాట్లాడితే విశ్వగురువు అంటరు. ఇంతకు విశ్వగురువా? విషగురువా? వాళ్లు నరుకుడు నరికితే.. ఇక్కడి నుంచి ఆక్కడిదాకా అరాచక, కిరాతక రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయిని చూేస్త రూ.82 అయిందని, నేపాల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటుందా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. ‘‘ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్‌ రూ.1200 చేసింది ఎవరు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది ఎవరు? అలాంటి వారికి ఓటు వేయాలా?’’ అని అన్నారు. తెలంగాణ మాదిరిగానే.. దేశాన్ని బాగుపరిచేందుకు బీఆర్‌ఎస్‌ పుట్టుకొస్తుందని కేసీఆర్‌ చెప్పారు. ఇది చాలా గొప్ప అవకాశమని, ఈ సువర్ణావకాశం మునుగోడుకే దక్కినట్లవుతుందని తెలిపారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి పునాదిరాయి పెట్టే అవకాశం మునుగోడుకే దక్కిందన్నారు. రేపు కేసీఆర్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు పునాదిరాయి మునుగోడే అవుతుందని పేర్కొన్నారు.

ఎల్లకాలం మునుగోడును తన గుండెల్లో పెట్టుకుంటానని, అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ దేశాన్ని కూడా మనమే నడిపిద్దామన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలుకు బీజేపీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? అని ప్రశ్నించారు. ‘‘మన నీళ్ల వాటా ఇవ్వడానికి ఏమైంది? నేను మహామొండి. మునుగోడులోని ప్రతి ఎకరానికీ నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తిచేేస బాధ్యత నాది’’ అని చెప్పారు. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్‌ కోరుతున్నారని, ప్రభాకర్‌రెడ్డిని గెలిపిేస్త 15 రోజుల్లోనే ఈ కోరిక నెరవేరుస్తానని చెప్పారు.

పోరాడే వారి చేతిలో కతి పెట్టండి..

టీఆర్‌ఎస్‌, వామపక్షాల నేతలు ఇంటింటికి వచ్చి చెబుతున్న విషయాలను ఆషామాషీగా తీసుకుంటే.. అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను హెచ్చరించారు. అరాచకాలపై పోరాటం చేస్తున్న వారి చేతిలో కత్తి పెడితే.. ప్రైవేటీకరణ, పెట్టుబడిదారుల తొత్తులను చీల్చి చెండాడి. ప్రజల ఆస్తులను కాపాడతామన్నారు. చేనేత బడ్జెట్‌ను టీఆర్‌ఎస్‌ హయాంలో రూ.1200 కోట్లు చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా, రైతుబంధు ఇస్తున్నామని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఉచితాలు అంటున్న ప్రధాని మోదీ... కార్పొరేట్‌ గద్దలకు నష్టం వచ్చిందని మాత్రం రూ.14 లక్షల కోట్లు ఇచ్చారని విమర్శించారు. ఏడాదికి కేవలం రూ.1.45 లక్ష కోట్లు ఖర్చు పెట్టగలిగితే దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వవచ్చని, దీనిపై మోదీ సమాధానం చెప్పాలని, మనుగోడులో ఓట్లు అడిగే ముందు బీజేపీ నాయకులైనా చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమన్నవారి తోకలు కత్తిరించాలని, ప్రజలు చైతన్యంగా ఉంటే వాళ్ల ఆటలు సాగవని అన్నారు.

ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారు

మునుగోడు మీద ఉప ఎన్నిక బలవంతంగా రుద్దబడిందని కేసీఆర్‌ అన్నారు. కానీ, నియోజకవర్గ ప్రజలు ఇచ్చే తీర్పు వారికి చెంప పెట్టు కావాలన్నారు. గత 20 ఏళ్ల మంత్రి జగదీశ్‌రెడ్డి లేకుండా నల్లగొండ జిల్లాలో ఏ సభలో కూడా తాను మాట్లాడలేదని కేసీఆర్‌ చెప్పారు. వచ్చేటపుడు బాధతో వచ్చానన్నారు. ‘‘జగదీశ్‌రెడ్డి ఏం తప్పు చేశారు? ఆయన్ను ఎందుకు నిషేధించారు? మేం ఎక్కడైనా దౌర్జన్యం చేశామా? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. ఆయన లేకపోవడం బాధగా ఉంది. వీటన్నింటికీ జవాబు 3వ తారీఖు నాడు ప్రజలు చైతన్యంతో.. శాంతియుతంగా ఓటు ద్వారా చెప్పాలి’’ అని అన్నారు.

జాగ్రత్తగా ఓటు వేయాలి..

‘‘టీఆర్‌ఎస్‌ నిన్న ఇవాళ వచ్చింది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చాలా ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయి. కేసీఆర్‌ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులయ్యారు. మన మునుగోడు నీళ్ల గోస తీరిందా? అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఎగ్జిబిషన్లు పెట్టి చూపించారే తప్ప.. సమస్యను పరిష్కరించలేదు. అలాంటి నల్లగొండలో ఇప్పుడు ఫ్లోరైడ్‌ సమస్యలేదు. తాగునీటి తిప్పలు లేవు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు రాష్ట్రం పచ్చబడగానే... నయవంచన చేసే పార్టీలు తిరుగుతున్నాయని విమర్శించారు. దండంపెట్టి చెబుతున్నానని, ఒళ్లు మరిచిపోయి ఓటేసి ఇల్లు కాలబెట్టుకోవద్దని అన్నారు. ‘‘ఎన్నికలు రాగానే గాయి, గత్తర కావొద్దు. బావ చెప్పిండనో, బామ్మర్ది చెప్పిండనో ఓటు వేయొద్దు. ప్రజల్లో చైతన్యం రాకపోతే దోపిడీ కొనసాగుతుంది. ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి’’ అని సూచించారు.

ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆకట్టుకునేలా సాగింది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మునుగోడును తన గుండెల్లో పెట్టుకుంటానంటూ నేరుగా ఇక్కడి ఓటర్ల మనుసును తాకే ప్రయత్నం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు ప్రజల డిమాండ్లను తీరుస్తానని, ఆ బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రస్తావించడం ద్వారా నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరును కూడా కేసీఆర్‌ ఎత్తలేదు. మరోవైపు కాంగ్రెస్‌ గురించి, ఆ పార్టీ అభ్యర్థి గురించి కూడా మాట్లాడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీపీఎం, సీపీఐ నేతలతో మాత్రం రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేయించారు. కాగా, రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా ఇచ్చి తమను గందరగోళానికి గురి చేశారంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు చండూరు సభలో నిరసన తెలిపారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-10-31T05:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising