YS Sharmila: కేసీఆర్‌ను నిలదీసినందుకే అరెస్ట్: షర్మిల
ABN, First Publish Date - 2022-11-29T23:27:34+05:30
కేసీఆర్(KCR)ను నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని వైఎస్సార్టీపీ (YSRTP)అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కేసీఆర్(KCR)ను నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని వైఎస్సార్టీపీ (YSRTP)అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు నాంపల్లి కోర్ట్ (Nampally Court) ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అనంతరం లోటస్‌పాండ్(Lotuspond)లోని ఇంటికి చేరుకుని షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని ప్రశ్నించారు.ఇది పాకిస్తానా.. ఆప్ఘనిస్తానా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని( TRS Govt) నిలదీశారు.పోలీసులు అధికారుల్లా కాకుండా.. రౌడీల్లా వ్యవహరించారని మండిపడ్డారు.మా కార్యకర్తలను పోలీసులు ఎందుకు కొట్టారు? అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.పోలీసులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు.
కాగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, తన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నాడు. పంజాగుట్టలో ఆమె కారును అడ్డు తగిలారు. డోర్ లాక్ చేసుకుని షర్మిల కారు లోపలే ఉన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కారును క్రేన్‌తోనే లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగానే లాక్కెళ్లారు. ఆ తర్వాత పీఎస్ బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించి 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-11-29T23:33:16+05:30 IST