Revanth reddy: ప్రమాదం ఉందని తెలిసినా.. రాహుల్ వెనకడుగు వేయలేదు..
ABN, First Publish Date - 2022-11-06T12:29:56+05:30
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గత నెల 23వ తేదీన తెలంగాణలో ప్రవేశించిందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గత నెల 23వ తేదీన తెలంగాణలో ప్రవేశించిందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు అలుపెరగకుండా యాత్ర కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పెద్దశంకరం పేట మండలం, చింతల్ లక్ష్మాపూర్‌లో రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. భరోసానిస్తూ రాహుల్ యాత్ర సాగుతోందన్నారు. సోమవారం తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగుస్తుందన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా వీడ్కోలు పలికేందుకు రేపు మేనూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు అందరూ భారీగా తరలిరావాలని పిలుపిచ్చారు.
ప్రపంచ చరిత్ర పుటల్లో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేశారని, వారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని రేవంత్ కొనియాడారు. ఈడీ, సీబీఐ దాడులు చేసినా, రాహుల్ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా.. ఆయన వెనకడుగు వేయలేదని ప్రశంసించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అవినీతితో కుళ్లి, కృశించి పోయిందని విమర్శించారు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని, అందుకే ప్రజలంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా కదలిరావాలని పిలుపిచ్చారు. రేపటి సభను విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని, యాత్రను విజయవంతం చేసిన ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2022-11-06T12:30:00+05:30 IST