లక్ష్యం దిశగా అడుగులు
ABN, First Publish Date - 2022-11-16T00:51:51+05:30
ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు వైపు రైతులకు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ ఏడాది 5,800ఎకరాల విస్తీర్ణంలో పెంపకం
నర్సరీల్లో పంపిణీకి సిద్ధంగా 3.30లక్షలకు పైగా మొక్కలు
వలిగొండ-రామన్నపేట సరిహద్దుల్లో పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు
ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు వైపు రైతులకు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యావన శాఖతో పాటు తెలంగాణ రాష్ట్ర సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ (టీఎస్ ఆయిల్‌ఫెడ్) రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. జిల్లాలో మోత్కురు మండలం దత్తప్పగూడెంలో నర్సరీని ఏర్పాటుచేశారు. ఎకరాకు 57 మొక్కల చొప్పున నాటేందుకు 3.30లక్షలకు పైగా పెంచుతున్నారు. ప్రస్తుతం సిరాడ్, ఎంఎల్-161 అనే రకం మొక్కలను పెంచుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకురాడంతో, మొక్కల పంపిణీతోపాటు పొలాల్లో నాటడం ప్రారంభమైంది. మండలాలవారీగా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఫీల్డ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల భూముల్లో భూసార పరీక్షలు చేపడుతున్నారు. చవుడు నేలలు తప్ప... మిగతా అన్ని నేలలకు ఈ సాగు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతుల భూములను పరిశీలించి, మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం 5,800 ఎకరాలు
జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 240ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ, ఆత్మకూరు(ఎం), గుండాల, రామన్నపేట, మోత్కురు, తదితర మండలాల్లో ఈ మొక్కలను రైతులు నాటారు. తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే ఈసాగులో చాలా తక్కువ... తుఫాన్, వడగళ్ల వానలు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా తట్టుకుంటుంది. కోతులు, అడవి పందుల బెడద కూడా ఉండదని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆయిల్‌పామ్ సాగు ఇలా..
ఉద్యాన పంటల్లో ముఖ్యమైనది ఆయిల్‌పామ్. ఈ పంట ద్వారా రైతులకు ఆదాయం కూడా ఎక్కువే. ఆయిల్‌పామ్ సాగుకు అనువైన పరిస్థితులు యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉన్నాయి. ఈ పంట సాగుతో రైతులు సంవత్సరానికి నికరంగా రూ.73వేల ఆదాయాన్ని పొందవచ్చు. టేనేరా హైబ్రిడ్ ప్రపంచంలోనే అధికంగా పండించే ఏకైక వంగడం. ఏ కాలంలోనైనా మొక్కలను నాటుకోవచ్చు. నాటేందుకు 12-14 నెలల వయస్సు కలిగి, 1-1.3మీటర్ల ఎత్తు, 13ఆకులతో కాండం మొదలు మంచిగా ఉన్న మొక్కలను ఉపయోగించాలి. మొక్కలు నాటేటప్పడు 9/9/9 మీటర్ల త్రికోణాకారపు పద్ధతి దూరంతో హెక్టారుకు 143, ఎకరాకు 57 మొక్కలు వచ్చేట్లు నాటుకోవాలి. మొక్కలను 60 సెం.మీ పొడవు, 60 సెం.మీ వెడల్పు, 60 సెం.మీ లోతు తీసిన గుంతలలో నాటుకోవాలి. ఆయిల్‌పామ్ పంటకు నెలకు 150 మి.మీ. సంవత్సరానికి 1800 నుంచి 3000 మి.మీ. సమంగా విస్తరించి ఉన్న వర్షపాతం అవసరం. సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 22-24డిగ్రీల సెల్సియస్. సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 29-33 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఆయిల్‌పామ్ సాగుచేసుకోవచ్చు. సూర్యరశ్మి రోజుకు కనీసం ఐదుగంటలు ఉండాలి. దాదాపు అన్నిరకాల నేలలు అనుకూలమని, నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రియ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. ఆయిల్‌పామ్ అధికంగా దిగుబడి ఇచ్చేందుకు సమృద్ధిగా సాగునీరు అవసరం. వేసవి కాలంలో కూడా పుష్కలంగా నీరు అందించే బోరుబావుల కింద సాగు చేయడం మేలు. ఒక ఎకరా వరిసాగుకు అవసరమయ్యే నీటితో మూడు నుంచి నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ సాగు చేసుకోవచ్చు.
నీటి కొరత లేకుండా చూసుకోవాలి
నీటి కొరతవల్ల ఆకుల ఉత్పత్తి తగ్గి, పెరుగుదల సన్నగిల్లి, తదుపరి కాలంలో ఎక్కువ మగ పుష్పాలు వచ్చి, తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. పాదులలో మురుగునీరు నిలవకుండా చూసుకోవాలి. మూడేళ్లపైబడిన ఆయిల్‌పామ్ మొక్కలకు వర్షాకాలంలో దాదాపు 100-150 లీటర్లు, శీతాకాలంలో 160-170 లీటర్లు, వేసవికాలంలో 215-265లీటర్లు నీటిని ప్రతీరోజు అందించాలి. యాజమాన్య పద్ధతులు పాటించడంతో, 5 నుంచి 9ఏళ్ల వయస్సు గల తోటనుంచి సాలీనా హెక్టారుకు 25నుంచి 30టన్నుల దిగుబడి వస్తుంది.
రాయితీపై మొక్కల పంపిణీ
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాకు ఒక కోర్డినేటర్‌తోపాటు కొన్ని మండలాలను కలిపి ఫీల్డ్ ఆఫీసర్లను నియమించింది. జిల్లాలోని 17 మండలాలకు చెందిన రైతులకు ఈపంట సాగు విధానంతోపాటు పెట్టుబడి, ఆదాయం రాబడిపై అవగహన కల్పిస్తున్నారు. మొదటి మూడేళ్లకోసం అంతర పంటలు (కూరగాయల, మొక్కజొన్న, వేరుశనగ, ఆరటి, జామ, పొప్పిడి) పండించుకోవచ్చు. ఆయిల్‌పామ్ సాగుచేసేందుకు రైతులకు మొక్కలపై, అంతర్ పంటలకూ నాలుగు సంవత్సరాల వరకు సాగుచేసేందుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. ఆయిల్‌పామ్ మొక్కలకు ప్రభుత్వం హెక్టారుకు 150 మొక్కలకు గానూ.. ఒక్కో మొక్కకు రూ.193 చొప్పున రూ.29,000 రాయితీ కల్పిస్తుంది. ఒక్కో మొక్కకు రైతు వాటాకింద రూ.20 డీహెచ్‌ఎ్‌సవో యాదాద్రి పేరున డీడీ చెల్లించాలి. తోటల నిర్వహణకు మొదటి నాలుగు సంవత్సరాలపాటు హెక్టారుకు రూ.5250చొప్పున రాయితీ ఇస్తుంది. అదేవిధంగా అంతర పంటల సాగుకోసం మొదటి నాలుగు సంవత్సరాలకు హెక్టారుకు రూ.5250 చొప్పున రాయితీ కల్పిస్తుంది. బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఉంది.
పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు సన్నాహం
రానున్న ఐదేళ్లలో పెద్దఎత్తున ఆయిల్‌పామ్ దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు తరలించినట్లయితే... రైతులపై రవాణా భారం పెరుగుతుంది. ఈనేపథ్యంలో యాదాద్రిభువనగిరి జిల్లాలోని వలిగొండ, రామన్నపేట మండలాల్లో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పామాయిల్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.
సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు : అన్నపూర్ణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్నిపెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సాగు ద్వారా రైతులకు వచ్చే దిగుబడి, నికర ఆదాయాన్ని వివరిస్తున్నాం. ఒక ఎకరం వరిని పండించే నీటితో ఆయిల్‌పామ్ నాలుగుఎకరాల్లో సాగు చేయవచ్చు. సంప్రదాయ నూనెగింజలకన్నా ఆయిల్‌పామ్ పంట నూనె దిగుబడి నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుంది. జిల్లాలో ఈ సంవత్సరంలో 5,800 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. ఇప్పటివరకు 240 ఎకరాల్లో మొక్కలు నాటాం. ఆయిల్‌పామ్ సాగు చేయడంకోసం ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించి, మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Updated Date - 2022-11-16T00:51:54+05:30 IST