TRS MLAs Purchase: రామచంద్రభారతి.. స్వామిజీనా.. తాంత్రికుడా? గత చరిత్ర గురించి పోలీసులు ఆరా..!
ABN, First Publish Date - 2022-11-10T19:12:00+05:30
రామచంద్ర భారతి (Ramachandra Bharthi) అలియాస్ సతీశ్‌శర్మ ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి.
హైదరాబాద్: రామచంద్ర భారతి (Ramachandra Bharthi) అలియాస్ సతీశ్‌శర్మ ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. ఈ కేసులో రామచంద్ర భారతి పేరు బయటకు రావడంతో అసలు ఓ స్వామిజీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రామచంద్రభారతిని ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. రామచంద్రభారతి కేంద్రంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరీ రామచంద్రభారతి? ఆయన ఎమ్మెల్యే కొలుగోలులో వ్యవహారం ఎందుకు కీలకంగా వ్యవహరించారు? బీజేపీ (BJP) నేతలకు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటీ? ఆయన ఏ పీఠానికి అధిపతి? స్వామీజీకి రాజకీయాలతో పని ఏమిటీ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామచంద్ర భారతి గత చరిత్ర గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, హర్యానాలో స్వచ్ఛంద సంస్థల పేరుతో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పూజల పేరుతో పలువురు నేతలకు రామచంద్రభారతి దగ్గరైనట్లు గుర్తించారు. మహారాష్ట్ర, గోవా (Maharashtra Goa)లో ప్రభుత్వాలను కూలగొట్టినట్లు ఆడియో టేప్‌లో రామచంద్రభారతి పేర్కొన్నారు. వందల కోట్ల డబ్బులను ఎక్కడి నుంచి తేవాలనుకున్నారని రామచంద్రభారతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఎవరీ రామచంద్ర భారతి?
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ (Moinabad Farm house)లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల్లో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్ర భారతి ఒకరు. ఆయన అసలు పేరు వీకే సతీశ్‌శర్మ అని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ఆయన ఎవరు? ఏం చేస్తుంటారు? సాధారణంగా భారతి అనే పేర్లున్న వారు పీఠాధిపతులు. ఆయన ఏ పీఠానికి అధిపతి? అనే వివరాలు ‘గూగుల్’కు కూడా లభ్యం కాలేదు. హరియాణాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న తిల్పాట్ ప్రాంతంలోని గిర్దవార్ ఎన్‌క్లేవ్‌లో ఆయన నివాసం అని తెలుస్తోంది. రామచంద్రభారతి వాట్సాప్ డీపీ ప్రకారం.. ఆయన కేరళకు చెందిన ఓ తాంత్రికుడు అని స్పష్టమవుతోంది. ఆ ఫొటోలో ఉన్న పూజాసామగ్రి సాంతం కేరళీయులు వినియోగించే శైలిలో ఉన్నాయి. ఎదురుగా ఉన్న జ్యోతిలో ‘ఏక వత్తు’ మాత్రమే ఉంది. సాధారణంగా సాత్విక పూజల్లో.. రాజస పూజల్లో రెండు వత్తులతో దీపం వెలిగించాలనేది శాస్త్రం. తాంత్రిక పూజల్లో మాత్రమే ఏక వత్తుతో దీపాన్ని వెలిగిస్తారు. నాలుగు రోజుల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు జరిపిన పూజలోనూ రామచంద్ర భారతి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్‌లో కీలకమైన నాలుగు వీడియోలను ముఖ్యమంత్రి కార్యాలయం సాయంత్రం విడుదల చేసింది. ఈ వీడియోలో రామచంద్రభారతి సంభాషణలు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. రామచంద్రభారతి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆసక్తికర ఆఫర్లతో బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు చేశారు. ‘‘ఓపెన్‌గా చెప్పేయండి.. మా ప్రాతిపాదనలు మీకు ముందుగానే చెప్పాం’’ అని అన్నారు. పార్టీలో చేరే ముందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.50 కోట్లు ఇస్తామన్నారు. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నందు వివరించారు. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు బీ-ఫాం ఇప్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. బీజేపీ అంటే లోకల్ పార్టీ కాదని.. జాతీయ పార్టీ అని.. ఆరెస్సెస్ ఆర్గనైజర్ సంస్థ మాత్రమేనని స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-10T19:12:01+05:30 IST