TRS MLAs poaching case: కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం! సిట్ విచారణను నమ్మలేమన్న సంతోష్ తరపు న్యాయవాది
ABN, First Publish Date - 2022-11-25T17:42:08+05:30
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తరపున వాదించిన...
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి హైకోర్టులో ఆరోపించారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ నిందితుడు కాదు, అనుమనితుడు కూడా కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకంగా విచారిస్తుందన్న నమ్మకం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు, కేసుల పేరుతో వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ దురుద్దేశం ఉందని, కేసును క్వాష్ చేయాలని వాదించారు. బీఎల్ సంతోష్‌పై నమోదైన కేసులు, నోటీసులను నిలిపివేయాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో బీఎల్ సంతోష్ పేరు లేదని, ఇప్పుడు ఎలా నిందితుడుగా చేరుస్తారని ప్రకాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే బీఎల్ సంతోష్‌పై పక్కా ఆధారాలు ఉన్నాయని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 41 సీఆర్‌పీసీని అనుసరించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అయితే 41 సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించిన హైకోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
వాస్తవానికి విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే హైకోర్టు నేడు స్టే విధించింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన ఇటీవలే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్ సభ్యులుగా ఎంపిక చేశారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-11-25T17:48:03+05:30 IST