Tirumala: 2022లో 2.37 కోట్ల మందికి శ్రీవారి దర్శనం
ABN, First Publish Date - 2023-01-13T20:14:09+05:30
గత ఏడాదిలో 2.37 కోట్ల మంది భక్తులు (Devotees) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD Eo Dharma Reddy) తెలిపారు.
తిరుమల: గత ఏడాదిలో 2.37 కోట్ల మంది భక్తులు (Devotees) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD Eo Dharma Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది రూ.1,450.41 కోట్ల హుండీ కానుకలు లభించాయని, 11.54 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు.1.09 కోట్లమంది తలనీలాలు సమర్పించగా, 4.77 కోట్ల మందికి అన్నప్రసాదాలు అందజేశామన్నారు.ఈనెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనాల్లో 6.06 లక్షల మంది పాల్గొన్నారన్నారు. ఈ పదిరోజుల్లో 39.40 కోట్లు హుండీ ఆదాయం లభించిందన్నారు. ఈనెల 28వ తేదీ రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం స్థానంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న తిరుప్పావై 14వ తేదితో ముగుస్తుందన్నారు.15వ తేదీ నుంచి సుప్రభాతం యధావిధిగా జరుగుతుందన్నారు. వీఐపీ బ్రేక్ (VIP Break) సమయాన్ని ఉదయం 5 నుంచి 8 గంటలకు మార్చడం ద్వారా వీఐపీల నుంచి తిరుమల (Tirumala)లో వసతిపై వత్తిడి తగ్గిందన్నారు. రాత్రివేళలో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం అవుతోందన్నారు. ఈ విధానాన్నే మరికొంత కాలం అమలుచేసి పరిశీలిస్తామన్నారు.
తిరుపతిలో ఇచ్చే శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీలో దళారీల సంఖ్య పెరిగిందనే నివేదిక ఆధారంగా ఆఫ్‌లైన్ టికెట్ల జారీని ఎయిర్‌పోర్టుకు మాత్రమే పరిమితం చేశామన్నారు. శ్రీవారి ఆనందనిలయానికి స్వర్ణతాపడం సమయంలో దర్శనాల అమలులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మూలవర్ల దర్శనంతో పాటు బాలాలయంలోని కుంభదర్శనం కూడా ఉంటుందన్నారు. గదుల అద్దె విషయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తిరుమలలో 7,500 గదులతో పాటు యాత్రికుల వసతి సముదాయాల నిర్వహణ ద్వారా టీటీడీకి ఏడాదికి రూ.వంద కోట్లు నష్టం వస్తోందని వివరించారు. అయినప్పటికీ వీఐపీ గదుల అద్దెను మాత్రమే పెంచామే తప్ప సామాన్యులు బస చేసే గదుల అద్దెను పెంచలేదన్నారు. అద్దె పెంపుపై ధర్నాలు చేసేవారంతా హిందూవులేనన్నారు. కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసిన వ్యక్తులే తనను ఎన్నోసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, వీఐపీ రూములు అడగడంతో పాటు సిఫార్సు లేఖలు పంపినవారున్నారన్నారు. మరి వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడం లేదా అని ప్రశ్నించారు. ఈధర్నాలు చేసేవారు ఇకపై వీఐపీ దర్శనం చేసుకోకుండా సర్వదర్శనం చేసుకుంటే సామాన్యులకు అవకాశం లభిస్తుందన్నారు. నిత్యం వీఐపీ బ్రేక్ దర్శనం, వీఐపీ గదులు కావాలనుకునేవారే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని ధర్మారెడ్డి తెలిపారు.
Updated Date - 2023-01-13T20:14:13+05:30 IST