Adireddy: ‘ఆదిరెడ్డి’ బెయిల్‌పై విడుదల
ABN, First Publish Date - 2023-05-11T19:58:12+05:30
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (MLC Adireddy Apparao), టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసు(వాసు) బెయిల్‌పై రాజమహేంద్రవరం..
రాజమహేంద్రవరం: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao), టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసు(వాసు) బెయిల్‌పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. అప్పటికే జైలు వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అప్పారావు, వాసు మెయిన్ గేటు వద్దకు రాగానే ర్యాలీ ప్రారంభించగా డీఎస్పీ విజయపాల్ అక్కడకు చేరుకుని వాసు సతీమణి, ఎమ్మెల్యే భవానీ (MLA Bhavani) పీఏ ప్రసాద్‌కి ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వబోయారు. ఇద్దరు సీఐలతో పాటు భారీగా పోలీసులను మోహరించి ర్యాలీని నిలిపేశారు. వాసును ద్విచక్రవాహనంపై, అప్పారావును కారులో బలవంతంగా పంపేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అనుసరించగా రోప్, స్టాపర్‌బోర్డులు అడ్డుగా పెట్టి జైలు వద్దనే నిలువరించారు. వాహనాలకు టీడీపీ (TDP) జెండా తీసినవాళ్లను అనుమతించారు. అప్పారావు, వాసు ఇంటికి చేరుకున్న సమాచారం తెలిసిన తర్వాత స్టాపర్‌బోర్డులు తొలగించారు. డ్రైవరు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై విడుదల సమయంలో ర్యాలీకి ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులను టీడీపీ నాయకులు నిలదీశారు. అప్పుడు లేని అడ్డంకులు ఇప్పుడేమిటని ప్రశ్నించారు. కాగా.. జగజ్జననీ చిట్‌ఫండ్ కంపెనీలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ కంపెనీ డైరెక్టర్లయిన అప్పారావు, వాసును సీఐడీ ఈ నెల 1న అరెస్టు చేయగా.. కోర్టు అదే రోజున రిమాండు విధించిన విషయం విదితమే. వారికి హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జిల్లా కోర్టులో ష్యూరిటీలు తదితర ప్రక్రియ అనంతరం జైలు నుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు.
సైకో జగన్‌తో బ్రష్టుపట్టిన రాష్ట్రం
అప్పారావు, వాసు నేరుగా తిలక్‌రోడ్‌లోని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్నటీడీపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. గొంతులు నొక్కడానికి ఎక్కడికక్కడ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని విమర్శించారు. సైకో జగన్ అతనితో ఉండే కొందరు సలహాదారుల వల్ల రాష్ట్రం బ్రష్టుపట్టిపోయిందన్నారు. ’తప్పుడుకేసులు పెట్టి అరెస్టు చేసి భయపెడదామని చూశారు. టీడీపీ మా బీసీలకు, బలహీన వర్గాలకు లైఫ్ ఇచ్చింది. బీసీ సంక్షేమానికి పాటుపడింది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆలోచన లేకుండా పోయింది. చట్టబద్ధంగా ముందుకెళ్తాం. మా న్యాయవాదులు, టీడీపీ లీగల్‌సెల్‌ని సంప్రదించి సీఐడీ మీద కేసు వేస్తాం’ అని ఆయన స్పష్ట చేశారు.
Updated Date - 2023-05-11T19:58:12+05:30 IST