AP MLC Results: దొంగ ఓటర్లే చెల్లని ఓట్లకు కారణమా?
ABN, First Publish Date - 2023-03-17T19:58:19+05:30
తూర్పు రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు (Chittoor)లో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.
చిత్తూరు: తూర్పు రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు (Chittoor)లో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఊహించనివిధంగా 20,979 చెల్లని ఓట్లు బయటపడ్డాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,81,181 ఓట్లు ఉండగా, 2,69,339 పోలయ్యాయి. చెల్లని ఓట్లు మినహాయిస్తే 2,48,360 ఓట్లు వ్యాలిడ్‌గా మారాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెల్లని ఓట్లు ఎక్కువ సంఖ్యలో బయటపడ్డాయి. ఈ నియోజకవర్గంలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ (YCP) సుమారు 40 వేల దొంగ ఓట్లను నమోదు చేసినట్లు, ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం (Tirupati Assembly Constituency)లోనే 7 వేల దొంగ ఓట్లను నమోదు చేయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలకు అనుగుణంగా తిరుపతిలో పోలింగ్ (Polling) రోజున ప్రతిపక్షాలకు, మీడియాకు పెద్దఎత్తున దొంగ ఓటర్లు పట్టుబడ్డారు. దొంగ ఓటర్లంతా 6-10 తరగతులు చదివినవారు కావడం, కొందరు చదువురాని వారు ఉండడంతో ఓటు వేయడంపై అవగాహన లేక సరిగా ఓటు వేయలేదని తెలుస్తోంది. ఇన్‌వ్యాలిడ్ ఓట్లలో అభ్యర్థి పక్కన ఒకటి అని సంఖ్య వేయకుండా టిక్ పెట్టడం, రౌండ్ చుట్టడం, సంతకాలు చేయడం వంటి కారణాలతో అధిక సంఖ్యలో ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. గతంలో జరిగిన తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.
దొంగ ఓట్ల జాతర
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) దొంగ ఓట్ల ప్రభావం బాగా కనిపించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేయించిందనే ఆరోపణలు వినిపించాయి. పోలింగ్ రోజున ఎవరు పట్టభద్ర ఓటరో గుర్తించలేని పరిస్థితి కనిపించింది. విపక్షాల ఏజెంట్లు అయోమయానికి గురయ్యారు. పోలింగ్ కేంద్రం ఆవరణలోనే బీఎల్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తిష్టవేసి, ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. దొంగ ఓటరు దర్జాగా ఆ స్లిప్పును తీసుకొని నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు. దీంతో వైసీపీ దొంగ ఓట్ల జాతర కొనసాగిందని పలువురు వ్యాఖ్యానించారు. ఓటరు స్లిప్పు ఉంటే చాలు... గుర్తింపు కార్డు అవసరం లేదు అన్నట్లు కొందరు పోలింగ్ అధికారులు వ్యవహరించారు. దీంతో దొంగ ఓటర్లకు అడ్డులేకుండా పోయింది.
Updated Date - 2023-03-17T19:58:19+05:30 IST