AP News: కళ్యాణదుర్గంలో ఎస్సీ యువకుల ఆందోళన.. భారీగా పోలీసులు మోహరింపు
ABN, First Publish Date - 2023-07-31T12:08:41+05:30
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. కళ్యాణదుర్గంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పీర్ల ఊరేగింపు సందర్భంగా కళ్యాణదుర్గం టీ సర్కిల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులపై వైసీపీ నేత రామాంజనేయులు, కుటుంబ సభ్యులు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. రామాంజనేయుల వర్గీయుల చేతిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కళ్యాణదుర్గంలో పోలీసులు భారీగా మోహరరించారు. ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో కళ్యాణ్ దుర్గంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు నివాసం ఉంటున్న కాలనీలో పదుల సంఖ్యలో స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. మరోవైపు కళ్యాణదుర్గం పట్టణంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. రౌడీ షీటర్ రామాంజనేయులు, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం టీ సర్కిల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు బైఠాయించి నిరసనకు దిగారు.
Updated Date - 2023-07-31T12:08:44+05:30 IST