Ap debt : మరో 12వేల కోట్ల అప్పు
ABN, First Publish Date - 2023-07-27T02:12:40+05:30
అప్పు లేనిదే వైసీపీ సర్కారుకు రోజు గడవడం లేదు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల నుంచీ ఎడాపెడా రుణాలు తీసుకొస్తూనే ఉంది. దాదాపుగా ప్రతి మంగళవారం కొత్త అప్పుల కోసం ఆర్‌బీఐ గడప తొక్కుతూనే ఉంది.
ఆగస్టు 10లోపే తెచ్చేందుకు సన్నాహాలు
మరోసారి తెరపైకి బేవరేజెస్ కార్పొరేషన్
బీఎ్‌సఈలో లిస్టింగ్ చేసేందుకు చర్చలు
స్ట్రైప్స్ రూపంలో రుణ సేకరణకు యత్నం
కార్పొరేషన్ అప్పులు రాజ్యాంగ విరుద్ధం
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి తెస్తున్నారు
గతేడాది ఆగస్టులోనే ఆక్షేపించిన కేంద్రం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అప్పు లేనిదే వైసీపీ సర్కారుకు రోజు గడవడం లేదు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల నుంచీ ఎడాపెడా రుణాలు తీసుకొస్తూనే ఉంది. దాదాపుగా ప్రతి మంగళవారం కొత్త అప్పుల కోసం ఆర్‌బీఐ గడప తొక్కుతూనే ఉంది. అక్కడనుంచి రూ.వేల కోట్లు రుణం తెస్తున్నా కూడా నెల తిరిగేసరికి ఉద్యోగుల జీతాలు, పింఛన్లు చెల్లించడానికి, సంక్షేమ పథకాల అమలుకు కటకటగానే ఉంటోంది. ఓవైపు రాజ్యాంగ విరుద్ధంగా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకొస్తున్న సర్కారు ఆగస్టులో మరో భారీ అప్పు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర మార్గదర్శకాలను తోసిరాజని రాజ్యాంగంలోని అర్టికల్ 266, ఆర్టికల్ 293(4)కి, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధంగా వచ్చేనెల 10వ తేదీలోపే రూ.12వేల కోట్ల రుణం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం బేవరేజెస్ కార్పొరేషన్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తోంది. వాస్తవానికి మద్యం అమ్మకాలపై వచ్చే 150 శాతం వ్యాట్ ఆదాయం ప్రభుత్వ ఖజానాకే చేరాలి. అయితే అప్పుల కోసం దీనిలో తొలుత 100శాతం, ఆ తర్వాత మరో 40శాతం మొత్తం కలిపి 140శాతం సొమ్మును దొడ్డిదారిన బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి ఆ సంస్థ ఆదాయంగా వైసీపీ సర్కారు చూపిస్తోంది.
ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే వ్యాట్ ఆదాయంలో కేవలం 10శాతం మాత్రమే ఖజానాకు తరలిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 266కు విరుద్ధం. బేవరేజెస్ కార్పొరేషన్‌కు వస్తున్న ఈ ఆదాయాన్ని చూపించి ఇప్పటి వరకూ రూ.14వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మరో రూ.12వేల కోట్ల అప్పు తీసుకొచ్చేందు కు సర్కారు ప్రయత్నిస్తోన్నట్లు తెలిసింది. ఇప్పటికే మద్యం పై వచ్చే ఆదాయాన్ని చూపించి సర్కారు రూ.39వేల కోట్ల అప్పులు తెచ్చింది. గతేడాది ఆగస్టు 22న కేంద్రం నుంచి వచ్చిన లేఖ ప్రకారం... ఏపీ స్టేట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎ్‌సడీసీ) ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు తెచ్చుకొని వాడుతోందని ఆక్షేపించింది. ఆర్టిక ల్ 293(3), ఆర్టికల్ 266కు ఇది వ్యతిరేకమని తేల్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు రాజ్యాంగ విరుద్ధమైనవని కూడా అందులో కేంద్రం ప్రస్తావించింది. మరోవైపు బేవరెజెస్ కార్పొరేషన్‌ను బీఎ్‌సఈలో లిస్టింగ్ చేయించి ఎన్‌సీడీలు జారీ చేయడంద్వారా మార్కెట్‌లో అప్పులు తీసుకురావాలని గతం లో సర్కారు ప్రయత్నించినప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనా లు ప్రచురించింది. దీనిపై స్పందించిన బీఎ్‌సఈ... బేవరేజెస్ కార్పొరేషన్ ట్రేడింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని, ట్రేడ్ చేయవద్దని సభ్యులను హెచ్చరించింది. ఇప్పుడు లోపాలను సరిదిద్ది మంచి రేటింగ్ పొందేందుకు ట్రేడింగ్ ఏజెన్సీలతో చర్చ లు జరుపుతున్నట్లు తెలిసింది. మంచి రేటింగ్ ఉన్న ఏజెన్సీ ద్వారా బీఎ్‌సఈలో బేవరేజెస్ కార్పొరేషన్‌ను లిస్టింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈసారి స్ట్రైప్స్ రూపంలో 12వేలకో ట్ల అప్పు తెచ్చేందుకు సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Updated Date - 2023-07-27T02:12:40+05:30 IST