మిర్చి రైతుకు మంట!
ABN, First Publish Date - 2023-05-15T04:16:31+05:30
ఎర్ర బంగారంలా మెరిసిపోయే మిర్చి పంట నాలుగేళ్లుగా రైతులకు నష్టాలనే మిగులుస్తోంది. చీ
వీడని విపత్తులు, చీడపీడలు..కోట్లలో పంట నష్టం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎర్ర బంగారంలా మెరిసిపోయే మిర్చి పంట నాలుగేళ్లుగా రైతులకు నష్టాలనే మిగులుస్తోంది. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడి రూ.కోట్ల విలువైన పంట దెబ్బతిన్నది. మూడేళ్లుగా నల్లతామర తెగులు మిర్చి రైతుల్ని నాశనం చేసింది. అకాల, అధిక వర్షాలు మరింత దెబ్బతీశాయి. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయాడు. విపత్తులతో పంట దెబ్బతిని, పెట్టుబడులు కూడా దక్కక రైతులు అప్పుల పాలయ్యారు. ప్రతికూల పరిస్థితులతో కన్నీరు పెడుతున్న మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏ సాయమూ చేయలేదు. రాష్ట్రంలో 2017లో మిర్చి ధర పడిపోయినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున సాయం చేసింది. కానీ జగన్ సర్కార్ గొప్పగా చెప్పే ధరల స్థిరీకరణ నిధి నుంచి గత నాలుగేళ్లలో మిర్చి రైతులకు రూపాయి కూడా సాయం అందలేదు. కేవలం పొలంలో 33ుపైన పంట దెబ్బతిన్న రైతులకే ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోంది. అది కూడా కొందరికే అందిందని, అలాగే పంటల బీమా పథకంలో మిర్చి సాగుచేసిన అన్ని ప్రాంతాలకూ బీమా వర్తింపజేయడం లేదని, ఈ-క్రా్‌పలో నమోదు కాని కౌలురైతులకు గత రెండేళ్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. 2022-23లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్ మిర్చికే వాతావరణ ఆధారిత పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇది కూడా 2022ఆగస్టు నుంచి 2023 జనవరి మధ్య జరిగిన చీడపీడలు లేదా వానలోటు, అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికే వర్తింపజేయనున్నారు. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో మిర్చి దిగుబడి ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయనున్నారు.
ఎకరానికి రూ.2లక్షల నష్టం
ఏటేటా పెట్టుబడులు పెరుగుతుండటంతో మిర్చి సాగు చేయాలంటే రైతుకు మంట పుడుతోంది. ఎకరానికి ఖర్చు రూ.2లక్షల పైగా అవుతోంది 2019-20, 2020-21లో అధిక వర్షాలు మిర్చి దిగుబడిని దెబ్బతీశాయి. 2021-22లో పంట బాగా పండినా.. నల్ల తామర పురుగు విరుచుకుపడింది. మూడోంతుల పంటను రైతులు నష్టపోయారు. అయినా ప్రభుత్వం ప్రత్యేక సాయం చేయలేదు. 2022-23 మార్కెట్ బాగుంటుందన్న ఉద్దేశంతో రైతులు మిర్చి సాగు పెంచారు. కానీ మళ్లీ నల్ల తామర విజృంభించింది. ఎకరానికి 30క్వింటాళ్ల సగటు దిగుబడిలో 10క్వింటాళ్ల కనీస నష్టంగా తీసుకుంటే.. క్వింటా రూ.20వేల చొప్పున రూ.2లక్షలు నష్టం. జాతీయ విపత్తుల సహాయ నిధి మార్గదర్శకాల ప్రకారం చూసినా.. 33ుకన్నా అధికంగానే పంట నష్టం జరిగింది. అయినా.. మిర్చి రైతులకు సాయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం పంట నష్ట గణనలోకి తీసుకోలేదు. వేలాది మంది రైతులు రూ.కోట్ల విలువైన పంట నష్టపోయినా.. ప్రజాప్రతినిధులు మిర్చి రైతును పరామర్శించిన దాఖాలా లేదు. మిర్చికి డిమాండ్ ఉన్నా.. గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వ పెద్దలైనా కనికరిస్తారేమోనని మిర్చి రైతులు ఎదురుచూస్తున్నారు.
Updated Date - 2023-05-15T04:16:31+05:30 IST