వసూల్ రాజా పవర్ ప్లాన్
ABN, First Publish Date - 2023-05-05T03:46:39+05:30
ముఖ్యనేత వద్ద ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్న వసూల్‌రాజా.. బావ కళ్లలో ఆనందం చూసేందుకు తన ‘పవర్’ వాడుతున్నారు.
బావ కళ్లలో ఆనందం కోసమే..
తెలిసిన కంపెనీలకు కాంట్రాక్టులు
రూల్స్ అడ్డగోలుగా మార్చేసి అప్పగింత
400 కేవీ కెపాసిటీ ఉన్న కంపెనీ తొలగింపు
33 కేవీ సామర్థ్యం ఉన్న కంపెనీలకు వర్క్‌లు
ఆదాయంలో 60 శాతం బావ, బావమరిదికే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యనేత వద్ద ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్న వసూల్‌రాజా.. బావ కళ్లలో ఆనందం చూసేందుకు తన ‘పవర్’ వాడుతున్నారు. ఆయన అమలు చేస్తున్న పవర్ ప్లాన్ చాలా పెద్దదే. ఆయనతో ఉద్యోగం చేయిస్తూనే మూడో కంటికి తెలియకుండా పవర్ సెక్టార్‌లో కాంట్రాక్టులు చేయిస్తున్నారు. తనకు తెలిసిన కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి, వాటికి ఏ అర్హతలు, అవకాశాలు లేకున్నా, రూల్స్‌ను నేలబారుగా మార్చేసి వాటికి వర్క్‌లు ఇప్పించారు. వచ్చే ఆదాయంలో 40 శాతం కంపెనీకి (నిర్వహణ చార్జీలు మాత్రమే), మిగిలిన 60 శాతం వాటా బావతో పాటు తనకు దక్కేలా వసూల్‌రాజా పవర్ పుల్ ప్లాన్ వేశారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ పైసా వసూల్ తతంగం కొనసాగుతోంది. కోట్లాది రూపాయలు వర్క్ బిల్లుల రూపంలో వచ్చి పడుతున్నాయి. ఇంకేముంది బావ కళ్లలో ఆనందమే ఆనందం. దుబాయి ట్రిప్‌లు జోరుగా సాగుతున్నాయి.
నిబంధనలు మార్చేసి...
విద్యుత్ రంగంలో ప్రకృతి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ అది. ఈ రంగం రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను కల్పిస్తుందన్నది నిపుణుల మాట. అందుకే బడా కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంపై వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వం అలాంటి వాటికి పెద్దపీట వేసి అనేక రాయితీలు కల్పిస్తోంది. వసూల్‌రాజా కూడా దీనిపై బాగా దృష్టిపెట్టారు. తన చేతిలో ఉన్న పనే కాబట్టి బావకు కీలకమైన పోస్టింగ్ ఇప్పించడంతో పాటు అంతకుమించిన ప్లాన్ వేశారు. తనకు తెలిసిన రెండు కంపెనీలను ఈ రంగంలో ప్రమోట్ చేయాలనుకున్నారు. అప్పటికి వాటికి కేవలం 33కేవీ లైన్ సబ్‌స్టేషన్‌లను నిర్వహించిన సామర్థ్యం మాత్రమే ఉంది. అయినా ఆ కంపెనీలను ప్రమోట్ చేయడానికి.. అప్పటి వరకు ఓ విద్యుత్ రంగ సంస్థలో కీలక వర్క్‌లతో పాటు మెయింటెనెన్స్, స్పేర్‌పార్ట్‌ల సరఫరా కాంట్రాక్టు చేస్తున్న ప్రముఖ సంస్థకు కొనసాగింపు (కాంట్రాక్ట్ ఎక్స్‌టెన్షన్) ఇవ్వకుండా తప్పించారు. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని గొప్పలు చెప్పారు. ఆ తర్వాత టెండర్ నిబంధనలను సవరించారు. 400 కేవీ లైన్లతో కూడిన సబ్‌స్టేషన్‌లు, ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉన్న సంస్థలనే ఎంపిక చేయాలన్న నిబంధనను మార్చేశారు. కేవలం 33 కేవీ లైన్లతో కూడిన సబ్‌స్టేషన్‌లను నిర్వహించే సామర్థ్యం ఉన్న కంపెనీలు కూడా టెండర్ వేసేలా వెసులుబాటు కల్పించారు. ముందే సిద్ధం చే సిన కంపెనీలకు టెండర్ కట్టబెట్టారు. విద్యుత్ రంగ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద అవకాశాలు రావాలంటే ఆ కంపెనీలకు కూడా ఎంతో కొంత అనుభవం, ప్రభుత్వ వర్క్‌లు చేసిన నైపుణ్యం కావాలి. దీంతో భవిష్యత్‌లో తమకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ కంపెనీలు వసూల్ రాజా కోరిక మేరకు టెండర్ వేశాయి.
సొంత ఖాతాలోకి కోట్లు
ప్రాజెక్టులో వచ్చే ఆదాయంలో 40 శాతం కంపెనీకి ఇచ్చేలా అగ్రిమెంట్ ఉన్నట్లు తెలిసింది. అది కూడా నిర్వహణ చార్జీల కోసమే ఇస్తున్నట్టు తెలిసింది. ఇక మిగిలిన 60 శాతం ఆదాయం వసూల్‌రాజాకు, తన బావకు దక్కేలా అనధికార ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. గత ఏడాదిన్నరగా ఆ విద్యుత్ రంగ సంస్థలో జరుగుతున్న వర్క్‌లకు బిల్లులేవీ పెండింగ్‌లో లేవు. ఆ కంపెనీల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నారు. దీంతో 60 శాతం వాటా కింద వచ్చే ఆదాయం కోట్లాది రూపాయల్లో ఉంటోంది. ఇవికాకుండా అలవెన్సులు, ఇతరత్రా నెలకు 75 వేల నుంచి లక్ష దాకా సర్కారు నుంచి పిండుకుంటున్నారు. ఇదే పని ఓ సాధారణ ఉద్యోగి చేస్తే ఏసీబీనో, విజిలెన్స్ వాళ్లో పట్టుకొంటారు. ఉద్యోగం చేస్తూ దొంగ కాంట్రాక్టులు చేయడం నేరమని కేసులు పెడుతారు. కానీ వసూల్‌రాజాకు, ఆయన బావకు అలాంటివేమీ ఉండవు. ఎందుకంటే వసూల్‌రాజా ఉన్నది పవర్ సెంటర్‌లో కాబట్టి.
ఆన్‌డ్యూటీ పేరిట దుబాయి ట్రిప్‌లు
ప్రతినెలా వివిధ రూపాల్లో కళ్లు చెదిరే సొమ్ము వచ్చి పడుతుండటంతో వసూల్‌రాజా బావ, ఆయన సహచర బృందం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. వృత్తి రీత్యా ఆయన ఎప్పుడూ ఆన్‌డ్యూటీ లేదంటే అధికారిక టూర్‌లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఆ పేరిట ఆయన రెగ్యులర్‌గా దుబాయి వెళ్లి వస్తుంటారు. ఈ విషయం గూగుల్ టేకౌట్‌ను అడిగినా టూర్ మ్యాప్‌ను స్పష్టంగా ఇస్తుందని ఆయన సహచర బృందమే చెబుతోంది. ఇక దుబాయిలో వసతి, ఇతర ఏర్పాట్లు అన్నీ లగ్జరీగా ఉంటాయి.
Updated Date - 2023-05-05T03:46:39+05:30 IST