హైకోర్టు తుది తీర్పునకు లోబడే!
ABN, First Publish Date - 2023-05-18T04:07:10+05:30
రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అమరావతిలో రాజధానేతరులకు ఇళ్ల పట్టాలపై సుప్రీం స్పష్టీకరణ
పత్రాలపై అదే మాట ప్రచురించాలి
తీర్పు వ్యతిరేకంగా వస్తే పట్టాదారులు ప్రత్యేక ప్రయోజనాలు కోరరాదు
ఆర్-5 జోన్‌పై ధర్మాసనం ఉత్తర్వులు
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పట్టాలు జారీ చేస్తే హైకోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని, పట్టాల పత్రాలపైనా ‘హైకోర్టు తీర్పునకు లోబడి’ అని ప్రచురించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పట్టాలు అందుకున్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలు (స్పెషల్ ఈక్విటీస్) కోరరాదని తేల్చిచెప్పింది (అంటే.. ఇళ్ల స్థలం కేటాయించారు కాబట్టి ఇళ్లు నిర్మాణం చేపట్టామని, బ్యాంకు రుణం తీసుకున్నామని వంటి కారణాలు చెప్పి పరిహారం కోరరాదన్న మాట). థర్ట్ పార్టీ హక్కులను సృష్టించరాదని తీర్పులో పేర్కొన్నప్పటికీ లబ్ధిదారుల తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు దానిని తొలగించింది. ఆర్-5 జోన్‌లో రాజధానియేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరించడానికి నిరాకరిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పలువురు రాజధాని ప్రాంత రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. వాటిపై బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అర్వింద్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ చర్య పూర్వస్థితికి తీసుకురాలేనిదని తెలిపారు. 29 గ్రామాలకు చెందిన దాదాపు 33 వేల ఎకరాల భూములను రాజధాని అమరావతి కోసం ఇచ్చారని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాల కోసం ఎంత విస్తీర్ణంలో భూమి కేటాయించారని ధర్మాసనం ప్రశ్నించగా.. మొత్తం 900 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించామని, ఇది మొత్తం ఉన్న భూముల్లో 3.1 శాతమేనని, కానీ చట్టంలో మాత్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్యూఎస్) ఇళ్ల కోసం కనీసం 5 శాతం కేటాయించాలని ఉందని రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బదులిచ్చారు. ‘పెండింగ్‌లో ఉన్న అమరావతి కేసును జూలైలో విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తే పరిస్థితి ఏమిటి’ అని ధర్మాసనం అడుగగా.. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం కూడా ఈడబ్యూఎ్‌సకు 5 శాతం కేటాయించాలని ఉందని, కాబట్టి ఆ తీర్పుతో దీనికి సంబంధం లేదని సింఘ్వీ సమాధానమిచ్చారు. శ్యామ్ దివాన్ వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూముల సేకరణకు ప్రతి గ్రామానికీ అధికారులు తిరిగి రైతుల్లో అవగాహన కల్పించారని, దాంతో 29 గ్రామాల చెందిన రైతులు 38 వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాకుండా జాతీయ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రైతులు భూములిచ్చాక రాజధాని నిర్మాణానికి సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారని గుర్తు చేశారు. భూములు ఇవ్వడం ద్వారా పెద్ద రాజధాని ఏర్పడి అవకాశాలు, ఆర్థిక వృద్ధి జరుగుతుందని రైతులు భావించారని చెప్పారు. ‘మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో జస్టిస్ సిటీ, టూరిజం సిటీ, మీడియా సిటీ, పరిపాలన సిటీ వంటివి 9 ఉప పట్టణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఎలకా్ట్రనిక్ సిటీ. దీనివల్ల ఆర్థిక వృద్ధి జరగడమే కాకుండా పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయి. కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పడతాయి. పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మద్ధతుగా నిలుస్తాయి. అలాగే, మాస్టర్ ప్లాన్‌లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు నివాస జోన్‌లో ఇళ్ల కేటాయింపు ప్రస్తావన కూడా ఉంది. ప్రతి ఉప పట్టణంలో నివాస జోన్ ఉంటుంది. అందులోనే ఈడబ్ల్యూఎ్‌సకు కేటాయింపులు ఉంటాయి’ అని వివరించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రభుత్వం చేసినదాన్ని మొత్తం పక్కనపెట్టలేరని స్పష్టం చేశారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే గతేడాది మార్చిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతే ఏకైక రాజధాని అని, దానిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించుకుందని వ్యాఖ్యానించింది. దివాన్ స్పందిస్తూ.. చట్టాలు ఉపసంహరించుకున్నా కార్యనిర్వాహక అధికారాల ద్వారా ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని హైకోర్టు దానిని కట్టడి చేసిందని, ఆ అంశంపై ఇంకా చర్చ జరుగుతోందని, సుప్రీంకోర్టులోనూ విచారణ పెండింగ్‌లో ఉందని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌ను మార్చడం లేదా సవరించడం వంటివి చేయాలంటే ముందస్తుగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిగణించాల్సి ఉంటుందని, కానీ ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో పాటించకుండానే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎలకా్ట్రనిక్ సిటీలో స్థానికేతరులకు పట్టాలివ్వాలని ప్రభుత్వ నిర్ణయించి ఆ సిటీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్ మార్చాలంటే 15 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలను ఆహ్వానిస్తూ నోటీసు జారీ చేయాల్సి ఉంటుందని, అభ్యంతరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ధర్మాసనం కలుగజేసుకుని.. ‘రాజధాని కోసం భూములు ఇచ్చినందుకు గాను రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 52 చెబుతోంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా ఇవ్వవచ్చని చట్టంలో లేదు కదా’ అని ప్రశ్నించింది. తుది ల్యాండ్ పూలింగ్ పథకం నోటిఫికేషన్ జారీ అయ్యాక నోటిఫైడ్ ప్లాన్లలో చేర్చాలని సెక్షన్ 57(5) స్పష్టం చేస్తోందని శ్యామ్ దివాన్ బదులిచ్చారు. 5,844 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని, కానీ వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును పక్కనబెట్టి స్టేటస్ కో విధించాలని విజ్ఞప్తిచేశారు. ఎలకా్ట్రనిక్ సిటీని నిర్వీర్యం చేస్తే ఉద్యోగావకాశాలు కోల్పోతారని మరో సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ పేర్కొన్నారు. అమరావతి కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. హడావుడిగా ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
వ్యక్తిగత పిటిషన్లు: సింఘ్వీ
రాజధాని కోసం సేకరించిన దాదాపు 34 వేల ఎకరాల భూముల్లో కేవలం 900 ఎకరాలను మాత్రమే ఈడబ్ల్యూఎ్‌సకు ప్రభుత్వం కేటాయించిందని, ఇది మొత్తం భూమిలో 3.1 శాతం మాత్రమేనని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈడబ్య్లూఎ్‌సకు 5 శాతం కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. 8-10 మంది రైతులు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారని, ఇవి ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు కావన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘ఈ రోజు మేం ఉత్తర్వులు జారీ చేయలేదనుకోండి.. భూకేటాయింపులు, పట్టాలు జారీ చేయడం తదితర ప్రక్రియ పూర్తికావడానికి ఎంతకాలం పడుతుంది మీకు’ అని అడిగింది. భూముల కేటాయింపులు పూర్తయ్యాయని, పట్టాలు జారీ చేయడం మాత్రమే మిగిలి ఉందని సింఘ్వీ బదులిచ్చారు. సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మాస్టర్‌ప్లాన్‌ను సవరించినప్పుడు తగిన ప్రక్రియను అనుసరించలేదనడం తప్పని, 5 అభ్యంతరాలు వచ్చాయని.. మాస్టర్‌ప్లాన్‌ను మార్చరాదని వాటిలో ఉందని వివరించారు. ప్రతి అభ్యంతరాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా.. మీ మైండ్ అప్లయ్ చేశారా లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమైతే అందులో నిర్మాణాలు చేపట్టడానికి ఆర్థికంగా భారమవుతుందని లబ్ధిదారుల తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ రామచంద్రన్ తెలిపారు.
జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘అమరావతి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కఠినంగా అమలు చేయాల్సి వస్తే మీరు చేపట్టే నిర్మాణాలను తొలగించి పూర్వస్థితికి తీసుకురావలసి ఉంటుంది కదా’ అని ప్రశ్నించింది. ప్రజల జీవనోపాధికి సంబంధించిన విషయమని, ఈడబ్యూఎస్ వర్గానికి నివాస హక్కు ఉందని రాజీవ్ బదులిచ్చారు. మే 6న భూకేటాయింపు పూర్తయిందని, కేవలం పట్టాలు జారీ మిగిలి ఉందని చెప్పారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కూడా వాదనలు వినిపించారు. రైతుల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డు గుంటూరు ప్రమోద్ కుమార్, న్యాయవాది సంజయ్ సూరినేని, కార్తిక్ అశోక్ కూడా విచారణకు హాజరయ్యారు. ‘రైతులు ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, హరీశ్ సాల్వే, శ్యామ్ దివాన్ వంటి వారిని నియమించుకున్నారు. అదృష్టం’ అని సింఘ్వీ వాదనల సమయంలో వెటకారంగా వ్యాఖ్యానించారు. దానికి శేషాద్రినాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘ఒక కేసులో నేను ఫ్యాక్టరీ తరఫున వాదిస్తే.. సింఘ్వీ రైతు తరఫున వాదించారు. ఎవరైనా ఏ న్యాయవాదినైనా నియమించుకోవచ్చు’ అని అన్నారు. అయితే న్యాయపరమైన వాదనగా ఆ వ్యాఖ్య చేయలేదని, పట్టించుకోవద్దని సింఘ్వీ కోరారు.
Updated Date - 2023-05-18T04:07:10+05:30 IST