Anakapalli DSP Sunil: కారులో షికారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అనకాపల్లి డీఎస్పీ సునీల్.. కాంట్రవర్సీ ఎందుకైందంటే..
ABN, First Publish Date - 2023-02-13T11:25:33+05:30
గంజాయి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి కారును, అనకాపల్లి డీఎస్పీ సునీల్ (Anakapalli DSP Sunil) తన సొంత అవసరాలకు వినియోగించుకోవడాన్ని..
గంజాయి కేసులో నిందితుడైన ఒక వ్యక్తి కారును, అనకాపల్లి డీఎస్పీ సునీల్ (Anakapalli DSP Sunil) తన సొంత అవసరాలకు వినియోగించుకోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నంబరు ప్లేటు మార్చి దర్జాగా కారులో షికారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన డీఎస్పీ సునీల్‌పై డీజీపీ కార్యాలయం విచారణను వేగవంతం చేసింది. ఆదివారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి డీఎస్పీకి సంబంధించిన పూర్తి వివరాలు, మీడియాలో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్‌ను సేకరించినట్టు సమాచారం. అయితే విచారణకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇందుకు సంబంధించి విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.
అనకాపల్లి జిల్లా (Anakapalli District) కశింకోట పోలీసులు (Kasimkota Police) గత ఏడాది జూలై నెలలో 220 కిలోల గంజాయితోపాటు ‘ఏపీ 31బిఎన్ 1116’ (AP 31BN 1116) నంబరు గల స్కార్పియో వాహనాన్ని (Scorpio) స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి నిందితులు పరారయ్యారు. ఈ వాహనం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సంతబయలుకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ కమల్‌సింగ్ పేరున 2010వ సంవత్సరం నవంబరు నెలలో రిజిస్ట్రేషన్ అయినట్టు అప్పటి ఎస్‌ఐ దీనబంధు నిర్ధారించారు. వాహనాన్ని సీజ్ చేసి కశింకోట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు 16న చోడవరంలో ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి వాహనాలను తనిఖీ చేస్తుండగా కశింకోటలో పట్టుబడిన గంజాయికి సంబంధించి నిందితుడు సుల్తాన్ అజారుద్దీన్ కమల్‌సింగ్ ఎర్రరంగు మారుతి స్విఫ్ట్ కారులో (Maruti Swift) వస్తూ పట్టుబడ్డాడు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుకు కనీసం టీఆర్ నంబరు కూడా లేదని సమాచారం. నిబంధనల ప్రకారం ఏదైనా కేసులో అరెస్టయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారు, ఇతర సామగ్రిని కోర్టు ముందు ఉంచి, ఐదు రోజుల్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలి. కానీ స్వాధీనం చేసుకున్న స్విఫ్ట్ కారుకు ఎటువంటి నంబరు లేకపోవడాన్ని గమనించిన అనకాపల్లి పోలీసులు.. గంజాయి రవాణా చేస్తూ గతంలో కశింకోటలో పట్టుబడిన అజారుద్దీన్ కమల్‌సింగ్‌కు చెందిన స్కార్పియో (ఏపీ 31 బీఎన్ 1116) కారు నంబర్ ప్లేట్‌ను ఈ స్విఫ్ట్ కారుకు తగిలించి డీఎస్పీ సునీల్‌తోపాటు ఇతర పోలీసు అధికారులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నట్టు తెలిసింది.
కదులుతున్న డొంక...
అనకాపల్లి డీఎస్పీ సునీల్ (Anakapalli DSP Sunil Car).. నంబర్ ప్లేట్ మార్చిన స్విఫ్ట్ కారును సొంతానికి వినియోగిస్తూ ఈ నెల ఒకటో తేదీన విశాఖ బీచ్ రోడ్డులో (Vizag Beach Road) దొరికిపోయారు. డీఎస్పీ వేరొక వాహనాన్ని ఢీకొట్టి అక్కడ నుంచి వెళ్లిపోవడంతో బాధితుడు.. స్విఫ్ట్ కారు నంబరు ఆధారంగా నగరంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబరు (ఏపీ 31 బీఎన్ 1116)కు సంబంధించి వివరాల కోసం ఆర్టీవో కార్యాలయంలో వాకబు చేయగా గంజాయి కేసులో కశింకోట పోలీసులకు పట్టుబడిన స్కార్పియో వాహనంగా తేలింది. ఫిర్యాదులో పేర్కొన్నది స్విఫ్ట్ కారు కాగా, ఆర్టీవో రికార్డుల్లో స్కార్పియోగా బయటపడడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
గంజాయి నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న స్విఫ్ట్ కారుకు, గంజాయి తరలిస్తూ పట్టుబడిన స్కార్పియో వాహనం నంబరు ప్లేట్‌ను తగిలించుకుని డీఎస్పీ సునీల్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాతోపాటు పత్రికల్లోనూ రావడంతో జిల్లా ఎస్పీ గౌతమి శాలి, రాష్ట్ర డీజీపీకి నివేదిక సమర్పించారు. కారును డీఎస్పీ మాత్రమే వాడుకుంటున్నారా? లేక పోలీసు స్టేషన్‌లో ఇతరులు కూడా సొంత అవసరాలకు వినియోగిస్తున్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో డీఎస్పీతోపాటు అనకాపల్లి, కశింకోట స్టేషన్‌లకు చెందిన ఇద్దరు అధికారులపై వేటు తప్పదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-02-13T11:26:07+05:30 IST