ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court : బాబు గీత దాటలేదు!

ABN, First Publish Date - 2023-11-04T03:26:27+05:30

మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.


బెయిల్‌ షరతులను ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు: హైకోర్టు

ఇద్దరు డీఎస్పీల నియామక అభ్యర్థన తోసివేత

అది గోప్యత హక్కును హరించడమేనని వెల్లడి

బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించవద్దు

స్కిల్‌ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు

మాజీ ముఖ్యమంత్రికి న్యాయమూర్తి నిర్దేశం

ఆయన రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు ఏం సంబంధం?

ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు..

రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తే

పార్టీ ఎన్నికల అవకాశాలపై ప్రభావం: కోర్టు

రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు, ప్రభుత్వ పాలసీలపై అభిప్రాయాలు వ్యక్తపరచాల్సిన స్వతఃసిద్ధ బాధ్యత చంద్రబాబుపై ఉంది. రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తే ఆయన సారథ్యంలోని పార్టీ ఎన్నికల అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

- హైకోర్టు

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘించారని అనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని తేల్చిచెప్పింది. మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వులు సందర్భంగా కోర్టు నిర్దేశించిన షరతులకు చంద్రబాబుకు కట్టుబడి ఉంటున్నారా అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించాలన్న సీఐడీ అభ్యర్ధనను తోసిపుచ్చింది. అయితే అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లోని అభ్యర్థనలను పాక్షికంగా అనుమతించింది. పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొనకూడదని చంద్రబాబుకు స్పష్టం చేసింది. ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయొద్దని ఆదేశించింది. స్కిల్‌ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేస్తూ సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. మధ్యంతర బెయిల్‌ పై జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఎలాంటి మీడియా సమావేశాలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించకుండా అదనపు షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అధికారులు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇద్దరు డీఎస్సీ స్థాయి అధికారులు చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి కోర్టుకు నివేదికలు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. అనుబంధ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు.

సీఐడీ స్పష్టత ఇవ్వాలి..

చంద్రబాబు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్‌ బెయిల్‌తో సమానంగా చూడలేమని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు. సీఐడీ కోరిన విధంగా చంద్రబాబు కార్యకలాపాలు పరిశీలించేందుకు ఆయన ఇంటి వద్ద ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం గోప్యత హక్కును హరించడమేనని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది చేసిన వాదనలో బలం ఉందని చెప్పారు. ‘ఆయనపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు అధికార పార్టీ ప్రోద్బలంతో సీఐడీ కేసు నమోదు చేసిందని సీనియర్‌ న్యాయవాది వివరించారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు ఏమి సంబంధం అనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయ కార్యకలాపాలపై షరతులు విధించడం దర్యాప్తు ప్రక్రియకు ఏవిధంగా దోహదపడుతుందో సీఐడీ వివరణ ఇవ్వాలి. కోర్టు విధించే అదనపు షరతులు దర్యాప్తునకు ప్రయోజనం చేకూర్చేవిగా ఉండాలన్న చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలో బలం ఉంది. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మధ్యంతర బెయిల్‌పై ఉండగా.. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు, ప్రకటనలు చేయకుండా నిరోధించడం వాక్‌స్వాతంత్య్ర హక్కుపై ప్రభావం చూపుతుంది. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చామని.. చంద్రబాబు సాధారణ కార్యకలాపాలు నిర్వహించకూడదని, అభిప్రాయాలు వ్యక్తపరచరాదని చెప్పడానికి వీల్లేదు’ అని స్పష్టంచేశారు.

ప్రజలను బాబు నియంత్రించలేరు

మధ్యంతర బె యిల్‌ ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి చంద్రబాబు ర్యాలీ నిర్వహించి రాజకీయ ప్రసంగం చేశారని ఏఏజీ పేర్కొన్నారని.. జైలు నుంచి విడుదలయ్యాక ఆయన చేసిన ప్రసంగం, నిమగ్నమైన కార్యక్రమాల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టు ముందు ఉంచారని.. వాటిని పరిశీలిస్తే చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌, పొలిటికల్‌ ర్యాలీ నిర్వహించినట్లు కనపడడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘తనను పలకరించడానికి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు ప్రతిస్పందించడం చాలా సహజం. ఆయన్ను చూసేందుకు వెళ్లొద్దని ప్రజలకు ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. చంద్రబాబును చూడడానికి ప్రజలు రావడాన్ని దర్యాప్తునకు అవరోధంగా చూడలేం. గుంపులుగా వచ్చే ప్రజలను నియంత్రించే సామర్థ్యం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుంది. అంతేతప్ప చంద్రబాబు ప్రజా సమూహాన్ని నియంత్రిస్తారని ప్రభుత్వం ఆశించకూడదు. కోర్టు ముందు ఉంచిన వివరాలను పరిశీలిస్తే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. మధ్యంతర బెయిల్‌ దాఖలు చేసే సమయంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు కోరలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైద్య పరీక్షలతో పాటు సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతివ్వాలని ఆయన కోరినట్లయితే ఆ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలా లేదా అనే ప్రశ్న తలెత్తేది. కోర్టు ముందున్న వివరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. సభలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని చంద్రబాబును ఆదేశిస్తున్నాం. ఇది ఆయన ప్రాథమిక హక్కులను హరించడం కిందకు రాదు. కోర్టు విధించింది సహేతుకమైన షరతు. చంద్రబాబు, దర్యాప్తు సంస్థను దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన షరతులను విధిస్తున్నాం. మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వుల్లో విధించిన షరతులకు అదనంగా స్కిల్‌ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని.. సభలు, ర్యాలీలు నిర్వహించవద్దని, వాటిలో పాల్గొనవద్దని షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జైలు నుంచి విడుదలైన చంద్రబాబును పలకరించడానికి ప్రజలందరూ ఒకచోటకు చేరినట్లు కనపడుతోంది. అందుకు ప్రతిగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనను చూడడానికి వచ్చే ప్రజలను నిరోధించే పరిస్థితుల్లో ఆయన లేరనే విషయాన్ని గుర్తించాలి.

- హైకోర్టు

Updated Date - 2023-11-04T08:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising