AP News: ఏపీలో ఉనికి కోసం బీజేపీ పాట్లు: గుడివాడ
ABN, First Publish Date - 2023-06-12T21:42:32+05:30
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో ఉనికి కోసం బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కూడా ఉందని ప్రజలకు గుర్తుచేయడానికే కేంద్ర హోంశాఖ మంత్రి
విశాఖపట్నం: ‘‘మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో ఉనికి కోసం బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కూడా ఉందని ప్రజలకు గుర్తుచేయడానికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah), ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేసినట్టు అనిపిస్తోంది. వాళ్లు చేసిన విమర్శలను వైసీపీ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పాచికలు ఇక్కడ పారవు.’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) హెచ్చరించారు. బీజేపీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో సంబంధం ఉందనే భావన కొంతమందిలో ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. తమకు బీజేపీతోగానీ మరే పార్టీతోగానీ పొత్తులేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైల్వే జోన్, ప్రత్యేకహోదా, పోలవరం, స్టీల్‌ప్లాంట్ విషయాల్లో రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న రూ.350 కోట్లు కేంద్రం ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. తమ పార్టీని విమర్శిస్తే బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరగదని...వారు ఏ రీతిన మాకు గౌరవం ఇస్తే... తాము కూడా అదేరీతిన గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమిత్‌షా మాట్లాడిన వేదికపై ఉన్న నేతల్లో 2014కి ముందు ఆ పార్టీలో ఉన్నవారు ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. వారిచ్చే స్ర్కిప్టుని అమిత్‌షా చదవకుండా, రాష్ట్రంలో పరిస్థితులపై సమాచారం తెప్పించుకుని మాట్లాడాలని అమర్ అన్నారు.
Updated Date - 2023-06-12T21:42:32+05:30 IST