Viveka Case: అవినాశ్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు
ABN, First Publish Date - 2023-05-15T21:12:15+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (MP YS Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (MP YS Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం 11గంటలకు సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. గత 20రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో సీబీఐ (CBI) విచారణకు పిలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అవినాశ్‌ను సీబీఐ పలుమార్లు విచారించింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ తెలంగాణ కోర్టుకు విన్నవించింది. వివేకా హత్యకు సంబంధించిన కుట్రలో ఎవరెవరు భాగస్వాములనే విషయం తెలుసుకోవాలంటే అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడం చాలా అవసరమని కోర్టుకు వెల్లడించింది. వివేకా హత్యకేసులో సాక్ష్యాలు ధ్వంసం, కుట్ర వెనుక అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసిందని సీబీఐ పేర్కొంది.
గుండెపోటంటూ హత్యను దాచిపెట్టి సాక్ష్యాలు ధ్వంసం చేసే కుట్రలో అవినాశ్‌రెడ్డి భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి తప్పుదోవ పట్టించారని వివరించింది. వివేకా హత్యకు గురైన 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 1:58 గంటలకు అవినాశ్‌రెడ్డి ఇంట్లో సునీల్‌యాదవ్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తేలిందని సీబీఐ తెలిపింది. దీంతో పాటు నిందితుల మధ్య జరిగిన రూ.4కోట్ల లావాదేవీలు, సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు, హత్య జరిగిన రోజు ఉదయం ఆయన వాస్తవంగా ఎక్కడున్నారో తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. వివేకా హత్య కుట్రకు సంబంధించి అవినాశ్‌రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ఉత్కంఠ రేపుతోంది.
Updated Date - 2023-05-15T21:12:15+05:30 IST