హుటాహుటిన ఢిల్లీకి Jagan.. లోగుట్టు వేరే ఉందా?
ABN, First Publish Date - 2023-01-28T13:51:40+05:30
ఈ నెల 31న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరవబోతున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డిని రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమరావతి : ఈ నెల 31న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరవబోతున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డిని రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పేరుకు మాత్రం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ లోగుట్టు మరొకటి ఉందనే చర్చ బీభత్సంగా నడుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరడం వెనుక అసలు మతలబు వేరే ఉందని చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి అపాయింట్‌మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
కాగా.. అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరవడానికి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో తన కుమారుడు సీఎం జగన్ సహా, వైసీపీ నేతలకు ఒకరకంగా వైఎస్ విజయమ్మ దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటిది ఇవాళ అనూహ్యంగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు ముందు లోటస్ పాండ్‌కు వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏ విషయాలపై చర్చ జరిగిందనే విషయాలు బయటకు రాకున్నా కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో సీబీఐ ఆఫీస్ దగ్గర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. సీబీఐ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో.. అవినాష్‌రెడ్డి అనుచరులు ఉండకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ ఆఫీస్ దగ్గరకు పులివెందుల వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. పులివెందుల నాయకులను సీబీఐ ఆఫీస్ నుంచి పోలీసులు పంపించేశారు. సంబంధం లేని వ్యక్తులు ఉండకూడదని పోలీసుల హెచ్చరించారు.
ఇక వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించింది. వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జ్‌షీట్ విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు SC/01/2023 నెంబర్ కేటాయించింది. వివేకా కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, శివశంకర్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యింది.
Updated Date - 2023-01-28T13:51:42+05:30 IST