‘‘దిగి వచ్చి అగ్రిమెంట్ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’
ABN, First Publish Date - 2023-04-30T18:54:46+05:30
కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే..
విజయవాడ: ‘కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే.. ఉద్యోగుల మీద ఎంత చులకన ఉందో అర్ధమౌతోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశ్యంతో ఇప్పటి వరకు శాంతియుతంగా ఆందోళనలు చేపడుతుంటే.. చిన్నచూపుగా మీకు కనిపించవచ్చు. మేము ప్రకటించిన మూడో విడత ఉద్యమ కార్యాచరణ ముగిసే లోపు ప్రభుత్వం దిగి వచ్చి అగ్రిమెంట్ చేస్తే సరి. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్థంభింపచేసేలా మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇంకా ఉద్యమంలోకి రాని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు మనసాక్షిని ప్రశ్నించుకుని ఈ ప్రభుత్వంతో తలపడకపోతే ఎప్పటికీ ఉద్యోగ సమస్యలు పరిష్కారం కావు’ అని ఏపీ జేఏసీ అమరావతి అగ్రనేతలు పేర్కొన్నారు.
మూడో దశ ఉద్యమ కార్యాచరణను చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి నేతృత్వంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు నెలలుగా ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. ఏప్రిల్ 29 వ తేదీతో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ధర్నాతో రెండు దశల ఉద్యమం పూర్తి అయిందన్నారు. ఇప్పటి వరకు ఏపీజేఏసీ అమరావతి సభ్యసంఘాలే ఉద్యమ కార్యాచరణలో పాలు పంచుకున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
మూడో దశ ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ఇలా..
మే 8 : ఉపాధ్యాయులపై అక్రమంగా పెట్టిన కేసులను , సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని, వేధింపులు ఆపాలని, సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు స్పందనలో వినతిపత్రాలు
మే 9: మొదటి ప్రాంతీయ సదస్సును శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కలిపి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహణ
మే 12 - మే 19 వరకు : రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల దగ్గరకు వెళ్ళి ఉద్యోగుల ఆవేదన తెలిపే కార్యక్రమం
మే 17 : అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో రెండో ప్రాంతీయ సదస్సు నిర్వహణ
మే 27 : కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఏలూరు జిల్లాలో మూడవ ప్రాంతీయ సదస్సు నిర్వహణ
మే 30 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఒకరోజు సామూహిక నిరాహారదీక్ష
జూన్ 8 : గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో గుంటూరు జిల్లాలో నాల్గవ ప్రాంతీయ సదస్సు
Updated Date - 2023-04-30T18:54:46+05:30 IST