YSRCP : రచ్చ రచ్చగా మారిన హంస వాహనసేవ!
ABN, First Publish Date - 2023-10-23T20:15:54+05:30
అవును.. అమ్మవారి సాక్షిగా హంస వాహనసేవ రచ్చ రచ్చగా మారింది. పండగపూట కూడా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం చెలరేగింది..
అవును.. అమ్మవారి సాక్షిగా హంస వాహనసేవ రచ్చ రచ్చగా మారింది. పండగపూట కూడా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం చెలరేగింది. ఈ ఇద్దరి గొడవతో అధికారులు హంస వాహనం ఎక్కలేదు. కచ్చితంగా హంస వాహనం ఎక్కిస్తేనే తాను వస్తానంటూ వెల్లంపల్లి పట్టుబట్టారు. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం అర్చక బృందానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. పండితులు, అర్చకులు, పరిచారకులు, ఇతర సిబ్బంది ఇలా మొత్తం 31 మందికి మాత్రమే కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేతలు, పాలకమండలి సభ్యులకు పాసుల జారీలో వివాదం జరగడంతో వాహనంపైకి కలెక్టర్ అనుమతి నిరాకరించారు.
కావాల్సిందే..!
అయితే.. ప్రజాప్రతినిధులకు ఘాట్ పాసులను మాత్రమే దేవస్థానం జారీచేసింది. ‘అక్కర్లేదు.. ఇవేం చేసుకోవాలి’ అంటూ ఘాట్ పాసులను వెల్లంపల్లి వెనక్కి పంపారు. మరోవైపు.. హంస వాహనంపైకి అనుమతి లేకపోవడంపై చైర్మన్, సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి, నేతలు, అధికారుల కోసం బోధిసిరి పర్యాటక బోటు ఏర్పాటు చేసినప్పటికీ.. తమను హంస వాహనంపైకి ఎక్కించాలని నేతలు కోరడం గమనార్హం. అయితే.. నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. దేవాదాయ శాఖ ప్రస్తుత మంత్రి.. మాజీ మంత్రి మధ్య ఎప్పుడు చూసినా నడిచేవే. కాకపోతే ఇవాళ మరింత వివాదం ముదిరింది.
మేం పూజారులమా..?
ఇవాళ ఉదయం నుంచి చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై మంత్రి కొట్టు స్పందించారు. హంస వాహనంలో నదీ విహారానికి వీఐపీలకు నో ఎంట్రీ అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 31 మంది మాత్రమే హంస వాహనంలోకి అనుమతి ఉంటుందని.. ఇందులో పండితులు, అర్చకులు, పరిచారికులకు మాత్రమే ఉంటారన్నారు. ‘మేమేమైనా పూజారిలమా హంస వాహనం ఎక్కడానికి..’ అని వెల్లంపల్లికి స్ట్రాంగ్ కౌంటరిచ్చినట్లుగా మంత్రి కొట్టు మాట్లాడారు. ఈ దసరా వేడుకల్లో మంత్రి, అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది.తెప్పోత్సవం ముగియకుండా మధ్యలోనే మంత్రి కొట్టు, దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెళ్లిపోయారు. మంత్రి, చైర్మన్ తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం పూర్తవకుండా వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతా ఓకే కానీ..!
కాగా.. కృష్ణానదిలో గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు ముమ్మారు కృష్ణానదిలో విహరించారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ తదితర శాఖల సమన్వయంతో తెప్పోత్సవం నిర్వహణ జరిగిందిరు. పూర్తిస్థాయి బందోబస్తు నడుమ ఈ ఉత్సవం జరిగింది. కరోనా, వరదల కారణంగా మూడేళ్లుగా తెప్పోత్సవం నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. ఉత్సవాలకు వరకూ అంతా ఓకే కానీ వివాదాలతోనే జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-10-23T20:15:54+05:30 IST