Nara lokesh: అభిమానుల తాకిడితో లోకేశ్‌కు గాయాలు.. వైద్యుల సూచనలను పట్టించుకోకుండా..
ABN, First Publish Date - 2023-08-02T11:50:39+05:30
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రతీచోట లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువనేతను చూసేందుకు, కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు పాదయాత్ర ప్రాంతానికి తరలివస్తున్నారు.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రతీచోట లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువనేతను చూసేందుకు, కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు పాదయాత్ర ప్రాంతానికి తరలివస్తున్నారు. లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో లోకేశ్ కాస్త గాయపడ్డారు. అభిమానుల తాకిడితో లోకేశ్ చేతులకు గాయాలయ్యాయి. యువనేతను చూడాలని పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఎలాగైనా లోకేశ్‌తో కరచాలనం చేయాలని ఆతృత చూపించారు. దీంతో అభిమానుల గోళ్లు తాకడంతో గీసుకుపోయి లోకేశ్ రెండు చేతులకు గాయాలయ్యాయి. గోళ్లు గీసుకుపోయిన చోట్ల గాయాలు కావడంతో ఇన్ఫెక్షన్ సోకింది. వెంటనే డాక్టర్లు లోకేశ్ గాయాలను పరిశీలించి చికిత్స చేశారు. అయితే ఫంగల్ - బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ల హెచ్చరించారు. గాయాలు మానే వరకూ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని డాక్టర్లు సూచించారు. అయితే అభిమానాన్ని దూరం చేసుకోలేనని వైద్యుల సూచనలను కూడా లోకేశ్ పట్టించుకోలేదు. ఇప్పటికే భుజం నొప్పితో లోకేశ్ బాధపడుతున్నారు. దీంతో లోకేశ్ చేతులకు గాయాలను దృష్టిలో ఉంచుకోవాలని అభిమానులను యువగళం టీమ్ కోరుతోంది.
మరోవైపు ఈరోజు ఉదయం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి 173 వ రోజు యువగళం పాదయాత్రను లోకేశ్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 2283.5 కిలోమీటర్ల మేర యువనేత పాదయాత్ర చేశారు. ఈరోజు 18.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
ఉదయం
8:00 – గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
10:00 – ఉప్పలపాడులో రైతులతో సమావేశం.
11:00 – చాట్రగడ్డపాడులో స్థానికులతో మాటామంతీ.
12:00 – వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి సమీపంలో భోజన విరామం.
సాయంత్రం
4:00 – వినుకొండ గంగినేని డిగ్రీకాలేజి వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4:20 – చెక్ పోస్టు వద్ద స్థానికులతో సమావేశం.
4:40 – ముండ్లమూరు బస్టాండులో స్థానికులతో మాటామంతీ.
5:00 – ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6:15 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
9:45 – నగరాయపాలెం విడిది కేంద్రంలో బస.
Updated Date - 2023-08-02T12:05:32+05:30 IST