Vizianagaram: విజయనగరం వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నా ఈ వార్త చూడండహో..!
ABN, First Publish Date - 2023-08-14T22:11:22+05:30
తోటపాలెం, కోటకూడలి, మూడులాంతర్లు, కోట్లమాదప్పవీధి, కానుకుర్తివారివీధి, ప్రదీప్‌నగర్, రింగ్‌రోడ్డు ప్రాంతం, అయ్యకోనేరు గట్టు, కలెక్టరేట్, కణపాక, కేఎల్‌పురం తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెలకు లభించడం గగనంగా మారింది. అపార్టుమెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంకు..
విజయనగరంలో అద్దెలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఊహించని విధంగా మారిపోతున్నాయి. నగరం విశాఖకు దగ్గరగా ఉండడంతో పాటు విద్యాపరంగా కీలకంగా మారడం.. జాతీయ రహదారులు అందుబాటులో ఉండడం తదితర కారణాలతో అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం విద్యార్థులు, పేదలు, చిరు వ్యాపారులపై భారీగా పడుతోంది. ఆదాయం పెరగకపోయినా అద్దెలు పెంచుకుపోతున్నారని ఆయా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు దొరకడం కష్టమైపోతోంది.
తోటపాలెం, కోటకూడలి, మూడులాంతర్లు, కోట్లమాదప్పవీధి, కానుకుర్తివారివీధి, ప్రదీప్‌నగర్, రింగ్‌రోడ్డు ప్రాంతం, అయ్యకోనేరు గట్టు, కలెక్టరేట్, కణపాక, కేఎల్‌పురం తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెలకు లభించడం గగనంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌గా ఉన్న ఇళ్లను కూలదోసి అద్దెలకోసం మూడు, నాలుగు, అంతస్తుల భవనాలను నిర్మించేస్తున్నారు. అలాగే అపార్టుమెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంకు రూ.7వేలు, డబుల్‌బెడ్‌రూంకు రూ.10వేలు, త్రిబుల్‌బెడ్‌రూంకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ అద్దెలను చెల్లిస్తున్నారు. వీటితో పాటు అదనంగా పార్కింగ్, మెంటైనెన్స్, విద్యుత్ చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఇక సామాన్య మధ్యతరగతి వారుండే కొత్తపేట, పూల్‌బాగ్, వైఎస్సార్‌నగర్ కాలనీ, వీటీ అగ్రహారం కాలనీ, అంబేడ్కర్ కాలనీ, కంటోన్మెంట్, బూడివీధి, రాజీవ్‌నగర్‌కాలనీల్లో చిన్న ఇంటి అద్దె కూడా రూ.5వేలకు పైమాటే చెబుతున్నారు. విద్యార్థులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం పీజీలు (పేయింగ్ గెస్ట్) కూడా వెలశాయి. సొంతిళ్లు లేనివారు, ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా ఉన్నవారు అద్దెలు పెంచినా చేసేదిలేక అదే ప్రాంతంలో నివశిస్తున్నారు. నగరం ప్రధాన రహదారిలో ఉండే చిన్న దుకాణాల అద్దెలు కూడా వేలల్లోనే ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి విజయనగరం వచ్చిన వారు వ్యాపారాలు చేసుకుందామని ఆశపడినా భంగపడాల్సిందే. అద్దెల గురించి విని హడలిపోతున్నారు.
Updated Date - 2023-08-14T22:11:25+05:30 IST