2000 Notes Exchange: రెండు వేల నోట్ల మార్పిడికి బ్యాంకులకు వెళ్లకుండా కొత్త రూటు వెతుక్కున్నారుగా..!
ABN, First Publish Date - 2023-05-30T20:23:09+05:30
రెండు వేల నోట్ల మార్పిడికి జనం కొత్త పంథాను ఎంచుకున్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ఈ నోట్లను డిపాజిట్ చేస్తే.. భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖతో ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు దృష్టి సారించారు.
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా): రెండు వేల నోట్ల మార్పిడికి (2000 Notes Exchange) జనం కొత్త పంథాను ఎంచుకున్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ఈ నోట్లను డిపాజిట్ చేస్తే.. భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖతో ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంగా బంగారంపై పెట్టుబడులు (Investments on Gold) పెట్టేందుకు దృష్టి సారించారు. నిబంధనల ప్రకారం రూ.48 వేల మించి బంగారం కొనుగోలు చేస్తే ఆధార్ కార్డు (Aadhar Card) ఇవ్వాలి. దీనికి పాన్ కార్డు (PAN Card) లింక్ అయ్యి ఉండటంతో పెద్ద మొత్తంలో బంగారం కొంటే ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఈ కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) కొన్ని జ్యువెలరీ షాపులలో బిల్లులు లేకుండా బంగారం విక్రయిస్తున్నారు.
పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు (Gold Purchase) చేసే వారి నుంచి గ్రాముకు రూ.150 నుంచి 200 వసూలు చేసి రెండు వేల నోట్లు తీసుకుంటున్నారు. అంటే కాసుకు రూ.1,200 నుంచి రూ.1,600 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విధానం అధిక టర్నోవర్ గల జ్యువెలరీ షాపులలోనే జరుగుతోందని చిన్నతరహా బంగారు వర్తకులు చెబుతున్నారు. జిల్లాలోని రోజుకు కోటి టర్నోవర్ దాటిన షాపుల్లో రూ.2 వేల నోట్లు అధికంగా మారుస్తున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో టర్నోవర్ చూపించే వర్తకులకు బ్యాంకుల్లో అధిక మొత్తం రెండు వేల నోట్లు జమ చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా నిర్ణీత ధర కంటే అధిక ధరలకు బంగారం విక్రయించి వీటిని మారుస్తున్నారు. వారం, పది రోజులుగా ఉమ్మడి జిల్లాలో బంగారం అమ్మకాలు 25 శాతం పెరిగాయని అంచనా.
నరసాపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో అధికంగా బంగారం విక్రయాలు జరుగుతుంటాయి. 2016 నవంబరు 8న వెయ్యి, ఐదు వందల నోట్ల రద్దు సందర్భంలో కమీషన్ పద్ధతిపై నరసాపురం, భీమవరంలలో మార్పిడులు జరిగాయి. అప్పుడు రూ.లక్ష విలువైన పాత వెయ్యి, 500 నోట్లు ఇస్తే కనిష్టంగా రూ.90 వేలు గరిష్టంగా రూ.95 వేలు కొత్త నోట్లు మార్చుకున్నారు. ఇపుడు రూ.2 వేలు మార్పునకు అధిక సమయం ఉండటంతో కమీషన్ వ్యాపారాలు పెద్దగా సాగడం లేదు. తాజాగా నోట్ల మార్పిడి పసిడి మార్కెట్‌కి కలిసి వచ్చింది.
Updated Date - 2023-05-30T20:23:24+05:30 IST