ACB: ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్
ABN, First Publish Date - 2023-05-08T21:07:37+05:30
ఏలూరు జిల్లా (Eluru District) ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ (Incharge Sub Registrar)గా విధులు నిర్వహిస్తున్న కార్యాలయ సీనియర్ సూపరింటెండెంట్
ఏలూరు: ఏలూరు జిల్లా (Eluru District) ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ (Incharge Sub Registrar)గా విధులు నిర్వహిస్తున్న కార్యాలయ సీనియర్ సూపరింటెండెంట్ బళ్ళారి జోగేశ్వరరావు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. పెదవేగి మండలం కూచింపూడికి చెందిన కూచిపూడి రాంబాబు తన పేరు మీద ఉన్న ఇంటిని తన భార్య పేరుమీద గిఫ్టుడీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో సంప్రదించగా రూ.15 వేలు లంచం ఇవ్వాలని జోగేశ్వరరావు డిమాండ్ చేసి చివరకు రూ.10 వేలు ఇవ్వాలంటూ తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని రాంబాబు ఏసీబీ డీఎస్పీ బీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రాంబాబు రిజిస్ర్టేషన్ కార్యాలయంలో రూ.10 వేలు జోగేశ్వరరావుకు ఇచ్చారు. ఆయన ఆ సొమ్మును తీసుకుని పక్కనే ఉన్న ఏలూరు గొల్లాయిగూడానికి చెందిన ఐనవల్లి క్రాంతి కుమార్ అనే యువకుడికి ఇవ్వగా అదేసమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా వారిద్దరినీ పట్టుకుని అరెస్టు చేసి వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి రూ. 15 వేలు లంచం
ఆన్‌లైన్‌లో పొలం వివరాలు ఎక్కించేంరుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ, పల్నాడు జిల్లా (Palnadu District) అచ్చంపేట మండలం వేల్పూరు ఇన్‌చార్జ్ వీఆర్‌వో కొచ్చర్ల నాగేశ్వరరావు సోమవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. వేల్పూరు పరిధిలో గల గ్రంథసిరి గ్రామానికి చెందిన రైతు కిలారు చెంచయ్యకు సర్వే నెంబరు 140లో 5.75 ఎకరాల భూమి పూర్వార్జితంతో పాటు డాక్యుమెంట్లు, సర్వే రికార్డులు ఉన్నాయి. వీఆర్‌వో నాగేశ్వరరావును రైతు చెంచయ్య, ఆయన కుమారుడు మురళీ నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌లో ఎక్కించాలంటూ కాళ్ళరిగేలా తిరిగినా రూ 50వేలు లంచం డిమాండ్ చేసినట్టు చెంచయ్య కుమారుడు మురళీ తెలిపారు. ఐతే రూ 20వేలు ఇస్తామని వీఆర్‌వోతో మాట్లాడుకొని గత శుక్రవారం రూ 5వేలు ఇచ్చాడని, ఒప్పందంలో భాగంగా మిగిలిన రూ 15వేలు వీఆర్‌వోకు వచ్చినట్టు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వల పన్ని ఏసీబీ అధికారులు దాడులు చేయటంతో వీఆర్‌వో దొరికి పోయాడు. విసిగి వేసారటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు రైతు కుమారుడు మురళీ తెలియ జేశారు.
Updated Date - 2023-05-08T21:07:37+05:30 IST