Amanchi Krishna Mohan: ఆమంచి కృష్ణమోహన్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే..
ABN, First Publish Date - 2023-01-03T21:05:18+05:30
ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో వైసీపీ అధిష్టానం (YCP High Command) పార్టీపరంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి (Anam Expelled) ఉండగానే ఆయనను అవమానిస్తూ..
నెల్లూరు: ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో వైసీపీ అధిష్టానం (YCP High Command) పార్టీపరంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి (Anam Expelled) ఉండగానే ఆయనను అవమానిస్తూ వెంకటగిరి ఇన్చార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి (Nedurumalli Ramkumar Reddy) అప్పగించింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, వైసీపీ ఎమ్మెల్యేల నిస్సహాయతను బహిరంగంగా ప్రస్తావించినందుకు ఆనం రామనారాయణ రెడ్డికి జరిగిన అన్యాయం ఇది. మరో పరిణామం ఏంటంటే.. పర్చూరు ఇన్చార్జ్గా ఆమంచి కృష్ణమోహన్‌ను (Amanchi Krishna Mohan) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చీరాల వైసీపీలో (Chirala YCP) ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి సభ సాక్షిగా కూడా ఇటీవల బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి సభలో ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వేదికపైకి వచ్చి రెండో వరుసలో కూర్చున్నారు. తర్వాత కొద్దిసేపటికే ఎమ్మెల్యే బలరాం (MLA Karanam Balaram), ఆయన కుమారుడు వెంకటేష్ (Karanam Venkatesh) వేదికపైకి వచ్చారు. వీరు ఎడమొహం, పెడ మొహంగా వ్యవహరించారే తప్ప కనీసం అభివాదం కూడా చేసుకోలేదు. దీంతో సభ సాక్షిగా చీరాలలో ఉన్న కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి.
చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి కొన్నాళ్లుగా గందరగోళంగా ఉంది. ఎవరు ఏ అడుగులు వేస్తున్నారో అర్ధం కాక స్థానిక కార్యకర్తలు తలలు పట్టుకున్న పరిస్థితి. రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కమ్ములాటలే ఇందుకు కారణం. సీఎం జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన సమీక్షకు చీరాల, పర్చూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల హోదాలో కరణం వెంకటేష్, రావి రామనాథంబాబు హాజరయ్యారు. ఆ క్రమంలో అందరికి ఎవరెరు ఏంచేయాలో, ఏం చేయకూడదో అన్న అంశాల్లో ఒక క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చీరాల నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిగా కరణం వెంకటేష్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే డాక్టరు పాలేటి రామారావు గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఆయన అనుచరుల్లో కొందరు పాలేటితో ఉండగా, కొందరు కరణం వెంకటేష్‌తో ప్రయాణం చేస్తున్నారు.
ఈ పరిణామాలపై క్యాడర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనను సీఎం జగన్ పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకోమన్నారని చెప్పే క్రమంలో తన అనుయాయులతో అంతర్గత సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. తాను పర్చూరు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాజాగా సీఎం జగన్ నిర్వహించిన సమావేశానికి పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో రావి రామానాథం హాజరయ్యారు. దీంతో.. కేడర్‌లో గందరగోళం నెలకొంది. తాజాగా.. వైసీపీ అధిష్టానం ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కరణం బలరాం, ఆమంచి మధ్య ఉన్న విభేదాలకు వైసీపీ అధిష్టానం తాత్కాలికంగా బ్రేక్ వేయగలిగింది. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో ఉన్న రావి రామానాథం తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2023-01-03T21:14:51+05:30 IST