Avinash Reddy : ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా.. కడపకు అవినాశ్..
ABN, First Publish Date - 2023-04-26T11:03:55+05:30
ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
కడప : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మ.3.30 గంటలకు వాదనలు వింటామని హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కాగా.. పులివెందుల నుంచి కడపకు ఎంపీ అవినాశ్‌రెడ్డి చేరుకున్నారు. కడపలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. ఆయనను వైసీపీ నేతలు, అనుచరులు వచ్చి కలుస్తున్నారు.
కాగా.. అవినాశ్ రెడ్డిలో వేదాంత ధోరణి పెరిగింది. నిన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తన టైం బాగోలేదని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వేదాంత ధోరణిలో, ఒకింత నిర్వేదంగా అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకున్న ఆయ న.. 3.20 నుంచి రాత్రి 8గంటల వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఆ రోజు వివేకానందరెడ్డి చనిపోయినట్లు నాకు ఫోన్ వచ్చింది. సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేస్తే జమ్మలమడుగు వెళ్తున్న నేను తిరిగి అక్కడకు వెళ్లాను. ఫోన్ రావడం 15 నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు నా మీద నిందలు ఉండేవి కావు. ఈ కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. నన్ను, పార్టీని డ్యామేజ్ చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. సునీతమ్మ ఇచ్చిన మొదటి స్టేట్‌మెంటుకు, ఇప్పుడు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటి స్టేట్‌మెంటులో మా ప్రస్తావన లేదు. నాన్నకు, (శివ)శంకర్‌రెడ్డి అన్నకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ పాపం చేయలేదు కాబట్టే మూడేళ్లుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. మాట్లాడి ఉంటే బాగుండేది’ అని చెప్పారు. సీబీఐ అంటే పెద్ద విచారణ సంస్థ అని.. ఇలా విచారిస్తుందని ఊహించలేదన్నారు. దేవుడు తమ వైపే ఉన్నాడని.. ఎలా రాసిపెడితే అలా జరుగుతుందంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘అంతా దైవాఽధీనం.. ధర్మో రక్షతి రక్షితః అనే దాన్ని నేను నమ్మాను. ధర్మమే కాపాడుతుంది’ అని అవినాశ్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-04-26T11:13:36+05:30 IST