Supreme Court: అవినాశ్‌కు వ్యతిరేకంగా సునీత సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్‌లో కీలకాంశాలు..
ABN, First Publish Date - 2023-04-20T16:15:02+05:30
ఢిల్లీ: ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌కు వ్యతిరేకంగా సునీతారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో అనేక కీలకాంశాలు పేర్కొన్నారు.
ఢిల్లీ: ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌కు వ్యతిరేకంగా సునీతారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో అనేక కీలకాంశాలు పేర్కొన్నారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మెరిట్ ప్రకారం లేవని, దర్యాప్తు పూర్తయిన తర్వాత విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తీసుకోవడం సరి అయింది కాదన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపై గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కీలక దశలో ఉందని.. న్యాయస్థానం ఆదేశాల మేరకు హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని చేధించే పనిలో సీబీఐ దర్యాప్తు జరుగుతోందన్నారు. ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా సీబీఐ దర్యాప్తు జరిపేలా అనుమతించాలని ఆమె కోరారు. ఈనెల 30వ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రాధాన్యతను పట్టించుకోకుండానే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో దర్యాప్తుకు అవరోధాలు కలిగించేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని సునీతా రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. కాగా.. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ రోజు సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు. దీంతో రేపు సునీత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Updated Date - 2023-04-20T16:15:02+05:30 IST