BV Raghavulu: మహిళల పట్ల బీజేపీ చర్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి
ABN, First Publish Date - 2023-09-26T15:09:51+05:30
విజయవాడ: మణిపూర్, బిల్కిస్ భానో వంటి ఘటనలు మహిళల పట్ల బీజేపీ విధానాలకు అద్దం పడతాయని, మహిళల పట్ల బీజేపీ చర్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
విజయవాడ: మణిపూర్ (Manipur), బిల్కిస్ భానో (Bilkis Bhano) వంటి ఘటనలు మహిళల పట్ల బీజేపీ (BJP) విధానాలకు అద్దం పడతాయని, మహిళల పట్ల బీజేపీ చర్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు (CPM Polit Bureau Member) బీవీ రాఘవులు (BV Raghavulu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అప్రజాస్వామిక విధానాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)కు గత్యంతరం లేక ప్రతిపక్షాలు మద్దతిచ్చాయని ప్రధాని మోదీ (PM Modi) అంటున్నారని, గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రకరకాల కారణాలతో బీజేపీనే ఆటంకపరిచిందని ఆయన ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని, మహిళా బిల్లు రాజకీయ నాటకం తప్ప మరోటి కాదని రాఘవులు విమర్శించారు. ఇంతకాలం ఆగి మహిళా బిల్లు తీసుకురావడం చిత్త శుద్ధి లేకపోవడం, ఎన్నికల కోసం చేసిన పని మాత్రమేనని అన్నారు. డేనిష్ ఆలీ అనే ఎంపీ మీద మతపరమైన ఆరోపణలు పార్లమెంట్‌లోనే చేశారన్నారు. వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికమని అన్నారు.
చంద్రబాబు (Chandrababu) అరెస్టుకు వైసీపీ (YCP), బీజేపీయే కారణంగా తెలుస్తోందని రాఘవులు అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచించుకోవాలని సూచించారు. ఏఐఏడీఎంకే (AIADMK) బీజేపీ నుంచి దూరంగా జరగడం స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వం హస్తం చంద్రబాబు అరెస్టు వెనుక ఉందని ప్రతి ఒక్క మీడియాలో వార్తలు.. ప్రసారాలు వస్తున్నాయన్నారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబును ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీవీ రాఘవులు నిలదీశారు.
సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు (CPM Secretary Srinivasa Rao) మాట్లాడుతూ ఉద్యమం చేస్తున్న వారిమీద సంఘ విద్రోహ శక్తులని నింద మోపారని, అంగన్వాడీలకు పోలీసులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మహిళలపై అమానుషంగా ప్రవర్తించి అసెంబ్లీలో సాధికారత గురించి మాట్లాడతారని, మహిళా బిల్లు, మహిళా సాధికారత గురించి మాట్లాడే ముందు అంగన్వాడీలపట్ల సానుకూలంగా స్పందించాలని శ్రీనివాసరావు అన్నారు.
Updated Date - 2023-09-26T15:09:51+05:30 IST