Ramakrishna: ఆ విషయం హరీష్‌రావుకు తెలీదా?.. రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
ABN, First Publish Date - 2023-04-13T12:48:11+05:30
ఏపీ, తెలంగాణలో అభివృద్ధిపై రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: ఏపీ, తెలంగాణలో అభివృద్ధిపై రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనదైన రీతిలో స్పందించారు. ఆంధ్రాలో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీష్ రావుకు తెలేదా? అని యెద్దేవా చేశారు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అని అన్నారు. ఆదానీకి ఏపీలోని పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి ఆదానీని అభివృద్ధి చేయటం కనపడలేదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పటం గమనించలేదా? అని అడిగారు. ఇన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదని హరీష్ రావు చెప్పటం హాస్యాస్పదమంటూ హరీష్‌రావు వ్యాఖ్యలను తప్పుబడుతూనే... వైసీపీ ప్రభుత్వంపై రామకృష్ణ చురకలంటించారు.
Updated Date - 2023-04-13T12:48:11+05:30 IST