Pattabhiram: సమయానికి జీతాలు, సమస్యల పరిష్కారం కోరడం తప్పా?..
ABN, First Publish Date - 2023-06-06T15:02:43+05:30
అమరావతి: రాష్ట్రంలో అన్నివర్గాలను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో అన్నివర్గాలను సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) మోసం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం రివర్స్ పీఆర్సీ ఇచ్చి.. ఉద్యోగులను ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు. సీపీఎస్ (CPS) రద్దు చేస్తామన్న హామీ ఏమైంది?.. ఉద్యోగులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, సమయానికి జీతాలు, సమస్యల పరిష్కారం కోరడం తప్పా? అని ప్రశ్నించారు. రూ.7 వేల కోట్లకుపైగా డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సిఉంటే.. కేవలం రూ.175 కోట్లు చెల్లిస్తామంటారా? అంటూ నిలదీశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును ఎందుకు లాక్కున్నారో చెప్పాలన్నారు. అధికారమదంతో ఉద్యోగులను అణచివేయాలని చూస్తున్నారని, సీఎం జగన్ ఆటలు సాగనివ్వమని పట్టాభిరామ్ అన్నారు.
చంద్రబాబు (Chandrababu) హాయాంలో ఉద్యోగులకు ఠంఛన్‌గా 1వ తేదీనే జీతాలందేవని, ఆర్థిక ఇబ్బందుల్ని లెక్కచేయకుండా ఆయన గతంలో 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని పట్టాభిరామ్ గుర్తు చేశారు. ఒక పక్క ఉద్యోగసంఘాల నేతల్ని తప్పుడుకేసులతో వేధిస్తూ, వారి ఇళ్లకు పోలీసుల్ని పంపిన సీఎం జగన్.. మరోవైపు ఉద్యోగ సంఘాలతో నిన్న సమావేశమై కొత్తడ్రామాకు తెరలేపారన్నారు. చంద్రబాబు అశుతోష్ మిశ్రా నేతృత్వంలో వేసిన 11వ పీఆర్సీ కమిటీ నివేదిక ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. అది బయటపెట్టకుండా ముష్టి 23శాతం పీఆర్సీతో ఉద్యోగుల్ని మోసగించారన్నారు.
హెల్త్ కార్డుల కోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.300 వసూలు చేస్తున్న జగన్ ప్రభుత్వం, ఆ సొమ్ముని ఆసుపత్రులకు చెల్లించకుండా ఏ ఉద్యోగికి, వారి కుటుంబానికి సరైన వైద్యసేవలు అందకుండా చేసింది నిజంకాదా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. ప్రభుత్వవాటాగా కట్టాల్సింది కట్టకుండా ఉద్యోగుల హెల్త్ కార్డుల్ని చెత్తకాగితాలుగా మార్చిన ఘనత ఈ ముఖ్యమంత్రిదేనని పట్టాభి అన్నారు.
Updated Date - 2023-06-06T15:02:43+05:30 IST