Dussehra Festival : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. ఇవాళ ఒక్కరోజే..
ABN, First Publish Date - 2023-10-20T08:33:49+05:30
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలానక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు..
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలానక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు. గురువారం రాత్రి 11:30 నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరగా.. 2 గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం వినాయక గుడి నుంచి ఘాట్‌రోడ్డు వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్‌మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రోప్‌లతో భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో మరింత భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే.. మూలానక్షత్రం కావడంతో విశాఖలోని శారదాపీఠంలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇక తిరుమలలోనూ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీవారు హనమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రికి గజవాహనంలో తిరుమలేశుడు దర్శనమిస్తారు.
Updated Date - 2023-10-20T08:34:13+05:30 IST