AP News: సీపీఎస్ అమలుపై సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు...
ABN, First Publish Date - 2023-04-27T13:09:54+05:30
విజయవాడ: ఏపీలో సీపీఎస్ (CPS) అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ఏపీలో సీపీఎస్ (CPS) అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని, సీపీఎస్ అంశంపై హైకోర్టు (HIgh Court)లో పిటిషన్ దాఖలుకు నిర్ణయించిందన్నారు. ఏపీలో రాజ్యాంగ, చట్టబద్ధత లేని సీపీఎస్ అంశంపై హైకోర్టుకెళ్తామన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ (Jagan) అవగాహన లేకుండా.. సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారని బావించడం లేదని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారని.. ఇప్పటి వరకూ ఆ మాటే ఎత్తటం లేదని సూర్యనారాయణ విమర్శించారు. దీనిపై చాలా ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్ అమలుకు జారీ చేసిన ఉత్తర్వులకు రాజ్యాంగ బద్ధత, చట్ట బద్దత లేవని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయ పడుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసే సమయానికి కేంద్రం కూడా దీనిని నోటిఫై చేయలేదని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఏ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చెప్పలేదని సూర్యనారాయణ అన్నారు. కేంద్రం చేసిన సీపీఎస్ చట్టాన్ని ఏపీలోనూ ఆమోదం తెలియజేయాలి కానీ అలా జరగలేదన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్‌కు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధత లేదని.. కేవలం జీవో మాత్రమే జారీ చేశారన్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎస్‌కు కూడా తెలియజేశామన్నారు. జీవో ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేస్తున్నట్టు చెబితే అందులో ఉన్న అంశాలను యధాతధంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానానికి వెళ్లాయని సూర్యనారాయణ తెలిపారు. ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్ చట్ట బద్దం కానందున దానిని రద్దు చేయాలని సీఎస్‌ను కోరామని, దీనిపై ఏపీ హై కోర్టు విశ్రాంత న్యాయ మూర్తిని కూడా సంప్రదించామన్నారు. చట్ట బద్దం కానీ సీపీఎస్‌ను ఏపీలో అమలు విషయంపై హై కోర్టులో సవాలు చేస్తామని సూర్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-27T13:09:54+05:30 IST