ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh : జగన్‌ను సాగనంపుదాం

ABN, First Publish Date - 2023-08-25T02:50:53+05:30

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం 193వ రోజు కృష్ణా జిల్లాలో యువగళం

లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు

యువగళం పాదయాత్రలో లోకేశ్‌ హామీలు

విజయవాడ/గన్నవరం/హనుమాన్‌జంక్షన్‌/రూరల్‌, ఏలూరు, ఆగస్టు 24 (ఆంధ్రజోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం 193వ రోజు కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర సాగింది. మల్లవల్లి గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్‌ ప్రసంగించారు. జగన్‌ పాలనలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, గ్రీజు కూడా పెట్టనందుకే పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని మండిపడ్డారు. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, 2024లో జగన్‌ను ఇంటికి సాగనంపకపోతే రాష్ర్టానికి భవిష్యత్తు అనేది ఉండదన్నారు. జగన్‌ది జేసీబీ పరిపాలన అని ప్రజా వేదిక కూల్చడంతో తన విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడన్నారు.

సైకిల్‌ పాలన కావాలో, జేసీబీ పరిపాలన కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో మల్లవల్లిని పారిశ్రామికంగా తీర్చిదిద్ది వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్‌ హబ్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. మల్లవల్లికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని, 75శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగేళ్లలో జగన్‌ పాడుపెట్టిన వాటన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు. సాగర్‌ కాల్వల ఆధునీకరణతో పాటు చివరి భూములకు కూడా నీరందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

అనుసంధానం చేస్తాం..

గన్నవరం నియోజకవర్గం అంపాపురం, కోడూరుపాడు గ్రామస్థులు లోకేశ్‌ను కలసి తమ గ్రామ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కాలువ నుంచి ఏలూరు కాలువ అనుసంధానానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ పనుల నిమిత్తం అప్పటి ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులను రద్దు చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏలూరు కాలువను పోలవరం కాలువతో అనుసంధానం చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

రైతుల వినతిపత్రం

పాదయాత్ర వీరవల్లికి చేరిన క్రమంలో బాపులపాడు మండల రైతులు తమ సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం కుడికాల్వ నిర్వాసిత రైతులకు పరిహారం అందజేస్తామని, చెరువులకు నీరు అందించేందుకు గ్రామాల వద్ద స్లూయి్‌సలు ఏర్పాటు చేస్తామని, బాపులపాడు మండలంలో తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి నీరు అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. కాగా, కృష్ణాజిల్లా ఆయిల్‌ పామ్‌ రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. రంగన్నగూడెం దాటిన తర్వాత వచ్చిన పోలవరం కుడి కాలువ దగ్గర లోకేశ్‌ సెల్ఫీ దిగారు.

ఏలూరు జిల్లాలోకి పాదయాత్ర

పాదయాత్ర రాత్రి 8:25 గంటల తర్వాత ఏలూరు జిల్లాలోకి అడుగు పెట్టింది. ముందస్తు షెడ్యూల్‌ కంటే రెండుగంటలు ఆలస్యంగా పాదయాత్ర కొనసాగింది. రెండున్నర కిలోమీటర్ల మేర నడిచిన తరువాత గ్రామ సరిహద్దుల్లోని గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని ప్రైవేట్‌ స్థలంలో లోకేశ్‌ రాత్రి బస చేశారు. కాగా, 26న లోకేశ్‌, బ్రాహ్మణిల పెళ్లి రోజును పురస్కరించుకొని ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ శుక్రవారం ఆయన బస చేసిన ప్రాంతానికి రానున్నారు.

లోకేశ్‌తో వంగవీటి రాధా భేటీ

పాదయాత్ర భోజన విరామ సమయంలో లోకేశ్‌తో వంగవీటి రాధా ఆంతరంగికంగా సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు 20నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. భేటీ విషయాలు గోప్యంగా ఉంచారు. 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాధా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల పాదయాత్రలోనూ ఆయన తరచూ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌, రాధా భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

‘యువగళం’లో వైసీపీ కవ్వింపులు

పాదయాత్రను వివాదం చేసేందుకు కుయుక్తులు

కృష్ణాజిల్లాలో సాగుతున్న యువగళం పాదయాత్రలో వైసీపీ నాయకులు కవ్వింపులకు దిగారు. గురువారం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం మీదుగా సాగింది. ఈ మార్గంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దానిపై జగన్‌, కొడాలి నాని, వంశీ ఫొటోలను ఒకవైపు ముద్రించి మరోవైపు లోకేశ్‌ ఫొటో పెట్టారు. వంశీ వర్గీయుడు కసుకుర్తి చిన్ను పేరుతో ఈ బ్యానర్‌ ఏర్పాటు చేశారు. బ్యానర్‌లో లోకేశ్‌ ఫొటోను ముద్రించటాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. దాన్ని కసుకుర్తి కుటుంబీకుల స్థలంలో ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. వంశీ అనుచరులు దాడులకు తెగబడటంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. అదేసమయంలో రంగన్నగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వంశీ... కసుకుర్తి చిన్ను కుటుంబసభ్యులను తన వాహనంలో వీరవల్లి స్టేషన్‌కు తీసుకెళ్లి టీడీపీనేతలపైకేసులు పెట్టించారు. తమ కార్యకర్తలపై దాడి నేపథ్యంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు కూడా వీరవల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలపైనా వంశీ అనుచరులు తిరిగి కేసు పెట్టారు. వైసీపీ నేతలు ఇచ్చిన రెండు ఫిర్యాదులపై వీరవల్లి పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం కేసు నమోదు చేయలేదు.

Updated Date - 2023-08-25T04:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising