Minister Roja: సచివాలయ వ్యవస్థపై పనికిమాలిన పార్టీ గగ్గోలు పెడుతోంది..
ABN, First Publish Date - 2023-07-14T16:13:12+05:30
వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌పై మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో పవన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
కృష్ణా జిల్లా: వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌పై మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో పవన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఇప్పుడు తాజాగా పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా (Minister Roja) స్పందించారు. అధికార, ప్రతిపక్షం కాకుండా మధ్యలో ఉన్న పనికిమాలిన పార్టీ సచివాలయ వ్యవస్థపై గగ్గోలు పెడుతోందని పరోక్షంగా పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీల వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు దుర్మార్గం.. ప్రజలందరూ వాలంటీర్లకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
పామర్రులో నూతనంగా నిర్మించిన సచివాలయం- 1 భవనాన్ని శుక్రవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం పామర్రు నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్వక్షంగా వ్యవహరించే అధికారులను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. వైసీపీ పాలనలో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు వచ్చాయన్నారు. ప్రజల వల్లే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని... ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు నిర్లక్ష్యం తగదని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజల మేలు కోసం అనుకున్నది చేసే పట్టుదల గల వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక పోతున్నాయని మంత్రి మండిపడ్డారు.
సంక్షేమం, అభివృద్ధి కాకుండా రాష్ట్రం వైపు దేశం తిరిగి చూసేలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన ఉందన్నారు. రైతు భరోసా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితికి పంపారని..... దేశంలోనే గొప్ప సిస్టం రాష్ట్రంలో ఉందని తెలిపారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్య సాధనకై , రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మరింత మంచి చేయాలనే ఆలోచనతో ఇన్చార్జ్ మంత్రులు వారానికో నియోజకవర్గం పర్యటించేలా సీఎం చర్యలు తీసుకున్నారని మంత్రి రోజా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-14T16:14:06+05:30 IST