LokeshPadayatra: ఏపీ సీఎం పేరే అబద్ధాల రెడ్డి: నారా లోకేశ్
ABN, First Publish Date - 2023-02-03T20:01:03+05:30
ఏపీ సీఎం పేరే అబద్ధాల రెడ్డి అని టీడీపీ నేత నారా లోకేశ్ (NaraLokesh) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో ఆయన మాట్లాడుతూ అబద్ధాలకు...
చిత్తూరు: ఏపీ సీఎం పేరే అబద్ధాల రెడ్డి అని టీడీపీ నేత నారా లోకేశ్ (NaraLokesh) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో ఆయన మాట్లాడుతూ అబద్ధాలకు ప్యాంటు, షెర్ట్ వేస్తే.. అది జగన్‌రెడ్డని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధాలతో జగన్‌రెడ్డి అందలమెక్కారని మండిపడ్డారు. ప్రధాని మోదీ (Prime Minister Modi)ని చూడగానే సార్.. సార్.. అంటూ జగన్‌రెడ్డి వణికిపోతున్నారని ఎద్దేవాచేశారు. ప్రధానిని చూసి సార్.. సార్.. అనడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా యువగళం పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించమని, అడ్డంకులు సృష్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
బంగారుపాళ్యెంలో ఉద్రిక్తత
అంతకుముందు బంగారుపాళ్యెం (Bangarupalyem)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్ ప్రచార వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రచార వాహనాల తాళాలను బలవంతంగా పోలీసులు లాక్కున్నారు. వాహనాలు ఎందుకు సీజ్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నేతల ఆందోళనకు దిగారు. గురువారం కూడా పోలీసులు పలమనేరులో లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేశారు. మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన బహిరంగసభకు జనం భారీగా తరలిరావడంతో లోకేశ్ ప్రచార రథమెక్కి ప్రసంగించారు. అనంతరం పోలీసులు ప్రచార రథాన్ని సీజ్ చేశారు. అనుమతుల్లేకపోవడంతోనే వాహనాన్ని సీజ్ చేయాల్సి వచ్చిందని చిత్తూరు దిశ డీఎస్పీ బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పారు. వాహనంపై నిల్చుని మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పాలని లోకేశ్ ప్రశ్నించారు. తన వాహనాన్ని విడుదల చేసే వరకు ఒక్క అడుగు ముందుకు వేయనంటూ అక్కడే నిలబడిపోయారు. పావుగంట తర్వాత పోలీసు అధికారులు దిగివచ్చారు. ప్రచార రథాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2023-02-03T20:01:04+05:30 IST