Bus Accident: విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాటల్లో...
ABN, First Publish Date - 2023-11-06T11:10:42+05:30
నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బస్టాండ్‌కు చేరుకున్న ఆయన.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
విజయవాడ: నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు (RTC MD Dwaraka Tirumala Rao) స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బస్టాండ్‌కు చేరుకున్న ఆయన.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆర్టీసీ ఎండీ ఆవేదన వ్యక్తం చేశారు.
ద్వారకా తిరుమలరావు ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఆటోనగర్‌కు చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుంది. బస్సు రివర్స్ చేసే క్రమంలో ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లింది. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారు. సాయంత్రానికి వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం. అవుట్ సోర్సింగ్ కండక్టర్ వీరయ్య, మహిళ కుమారి, చిన్నారి చనిపోయారు. ఆర్టీసీ కార్పొరేషన్ తరపున మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తాం. గాయపడ్డ వారికి వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తాం. బస్సులు కంట్రోల్ స్పీడ్‌లో వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. బస్టాండు సమీప ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. బస్టాండులో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. డ్రైవర్ ఇటీవల సిక్‌లో ఉండి... కోలుకుని విధులకు వచ్చాడు. ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్‌కు బస్సు అప్పగిస్తాం. డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే... ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నాం. బస్సు కండీషన్ బాగానే ఉందని నాకున్న సమాచారం. నిపుణులు నివేదికను బట్టి ఎవరి తప్పో తేలుతుంది. వయసు రిత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తాం. ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది కరెక్ట్ కాదు. బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తాం. నెలకు మూడు వందల బస్సులు ఈనెల నుంచి కొత్తగా వస్తున్నాయి. కచ్చితంగా ఈ ప్రమాదం పొరబాటున జరిగింది. కారణాలు తెలిశాక చర్యలు తీసుకుంటాం. ఈ ఒక్క ఘటనతో ప్రజలు భయపడవద్దు’’ అంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంపై ఆర్టీసీ ఆర్‌ఎం ఏసుదానం (RTC RM Esudanam) మాట్లాడుతూ.. బస్సు ఫ్లాట్ ఫాం మీదకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. గుంటూరు వెళ్లేందుకు బస్సులోకి ప్రయాణికులను ఎక్కించారని.. బస్సు బయలుదేరేందుకు డ్రైవర్ రివర్స్ గేర్ వేశారని తెలిపారు. గేర్ సరిగా పడకపోవడంతో బస్సు ఫ్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. శాఖాపరమైన దర్యాప్తు చేశాక చర్యలు తీసుకుంటామని ఏసుదానం వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకువెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో కండెక్టర్, ఒక మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రమాదంపై పరిశీలిస్తున్నారు.
Updated Date - 2023-11-06T11:20:29+05:30 IST