Visakha MP: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో ఇన్ని ట్విస్టులా..!
ABN, First Publish Date - 2023-06-17T15:49:24+05:30
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
హేమంత్ పైనే అనుమానం
రుషికొండ ప్రాంతంలో కిడ్నాప్ అనగానే పోలీసులకు మొదట గుర్తొచ్చింది
అతడి పేరే.. అదే నిజమైంది
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పటికి తన భార్య జ్యోతి, కుమారుడు శరత్ బందీలుగా ఉన్నారని ఆయనకు తెలియదు. తనకు ముఖ్యుడైన ఓ స్నేహితుడికి జీఎస్‌టీ కేసు వస్తే...చూడాల్సిందిగా జీవీకి చెబితే ఆయన అక్కడకు వెళ్లకపోవడం, శ్రీకాకుళంలో ఉన్నానని చెప్పడం, కారు డ్రైవర్‌తో మాట్లాడితే రుషికొండలో మీ ఇంటి దగ్గరే దింపానని, ఆ తరువాత కోటి రూపాయలు తీసుకువెళ్లి ఇచ్చానని చెప్పడంతో ఎంపీకి అనుమానం వచ్చింది. అలాగే ఎంపీకి సమాచారం అందాలని జీవీ కూడా ఇద్దరికీ మంచి మిత్రుడైన ఓ వ్యక్తికి ఫోన్ చేసి రూ.25 లక్షలు పంపించాలని కోరారు.
జీవీ ఊహించినట్టుగానే ఆ వ్యక్తి రూ.25 లక్షలు అడిగిన విషయం ఎంపీకి తెలియజేశారు. దాంతో ఎంపీకి అనుమానం వచ్చింది. ఒకే రోజుల్లో అక్కడ కోటి రూపాయలు, ఇక్కడ రూ.25 లక్షలు.. ఇవన్నీ రుషికొండకు తీసుకువెళ్లడంతో మనసు కీడును శంకించింది. ఎవరో జీవీని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు చెప్పారు. రుషికొండ ఏరియాలో కిడ్నాప్ అనగానే పోలీసులకు ముందుగుర్తుకువచ్చింది హేమంతే. అతడి గురించి ఎంక్వయిరీ చేస్తే రెండు రోజులు నుంచి స్టేషన్‌కు రావడం లేదని తెలిసింది. మొబైల్ ట్రాకింగ్ పెడితే.. రుషికొండలో ఉన్నట్టు తేలింది. దాంతో ఇది అతడి పనేనని నిర్ధారించుకొని వెంటనే బృందాలు ఏర్పాటు చేసుకొని పట్టుకోవడానికి బయలుదేరారు. ఆ తరువాత వారిని పట్టుకున్నారు. తీరా చూస్తే బందీ లుగా ఎంపీ భార్య, కుమారుడు కూడా ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఎంపీ కూడా ఆశ్చర్యపోయారు. తరువాత జరిగింది తెలుసుకున్నారు.
Updated Date - 2023-06-17T15:49:27+05:30 IST