Rajahmundry: రాజమండ్రి నుంచి రైలెక్కేవారికి.. ముఖ్యంగా జనరల్ బోగీలెక్కే వారికి ఈ విషయం తెలుసో..లేదో..!
ABN, First Publish Date - 2023-06-05T19:00:08+05:30
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైలు ప్రయాణికులకు రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇటు ఏజెన్సీ ప్రాంతం, అటు కోనసీమ, కాకినాడ జిల్లాల ఈ స్టేషన్ల గుండానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ప్రతి రోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. రాను, పోను 120 రైళ్లు నడుస్తాయి.
కిక్కిరిసి ప్రయాణిస్తున్న జనరల్ బోగీలు
ప్రమాదం తర్వాత మారని తీరు
ఇంకనూ నిర్లక్ష్యంగా రైల్వే శాఖ
ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
ఇంటర్‌సిటీలు, పాసింజర్లు లేక ఇక్కట్లు
ఉమ్మడి జిల్లాలకు రిజర్వేషన్ కష్టమే
దూరప్రాంతాలకు జనరలే గతి
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
రైళ్లలో జనరల్ బోగీలు ఎక్కితే సాహసం చేసినట్టే.. ఏదో వంద రూపాయలు మిగులుతుంది కదా అని బడుగుబలహీన వర్గాలు జనరల్ బోగీలను ఆశ్రయిస్తారు. ప్రమాద సమయాల్లో వారే ఎక్కువగా బలైపోతారు. ఎందుకంటే జనరల్ బోగీలు రైలు ఇంజన్ వెనుక ఉంటాయి. లేదంటే రైలు బోగీల వెనుక ఉంటాయి. మధ్యలో రిజర్వేషన్, ఏసీ బోగీలు ఉంటాయి. రైలుకు ఏ ప్రమాదం వచ్చినా ముందు నుంచో వెనుక నుంచో వచ్చే అవకాశమే ఉంటుంది. గురువారం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో జరిగిందిదే. దీంతో జనరల్ బోగీలో వారే ఎక్కువగా మృత్యువాత పడ్డారు. జనరల్ బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో వారే బలైపోతున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైలు ప్రయాణికులకు రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇటు ఏజెన్సీ ప్రాంతం, అటు కోనసీమ, కాకినాడ జిల్లాల ఈ స్టేషన్ల గుండానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ప్రతి రోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. రాను, పోను 120 రైళ్లు నడుస్తాయి. సుమారు 60వరకూ గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తాయి. అయితే ఈ ప్రాంతం నుంచి బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు వెళ్లాలంటే రిజర్వేషను కష్టంగా మారుతోంది. తప్పని పరిస్థితుల్లో జనరల్ బోగీలను ఆశ్రయిస్తారు. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, పాసింజర్లు లేక జనరల్ బోగీల్లో రద్దీ పెరిగిపోతోంది. దీనిపై రైల్వే అధికారులు దృష్టి పెట్టాలి.
సరిపడా రైళ్లు లేవు..
ఉమ్మడి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రజలు ఎక్కువగా గోదావరి, గౌతమి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను ఆశ్రయిస్తుంటారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి హైదరాబాద్, విశాఖ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రాకపోకలు సాగిస్తాయి.ఈ రైళ్లలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా వాసులకు రిజర్వేషను కోటా తక్కువ. సాధారణంగా రైలు బయలుదేరే (ఆరిజిన్) స్టేషనుకు రిజర్వేషను కోటా ఎక్కువగా ఉంటుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి నడిచినప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రయాణికులకు రిజర్వేషను కోటాలో ఇబ్బంది ఉండేది కాదు. ఆ రైలును భువనేశ్వర్ వరకూ పొడిగించారు. దీనికి భీమవరం, తణుకు కోటా ఎక్కువ. దీంతో మన రిజర్వేషను కోటా పడిపోయింది. విశాఖ పొడిగింపు వల్ల ఈ ప్రాంతం వాసులకు జరిగే అన్యాయంపై ప్రశ్నించకుండా పార్లమెంట్ సభ్యులు నోటికి ఎప్పుడో తాళం వేసేసుకున్నారు.
ఇక మిగిలింది గౌతమి.. దీనికి కాకినాడ, రాజమహేంద్రవరం కోటా ఎక్కువగా ఉండడంతో రిజర్వేషన్లలో తృప్తిపడే పరిస్థితి. కాకినాడ నుంచి భావ్‌నగర్ మినహా ఇటు నుంచి దూర ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు లేవు. దీంతో కోనసీమ, ఏజెన్సీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, భీమవరం, సామర్లకోట, తుని ప్రాంతాల వాళ్లకు రిజర్వేషను తిప్పలు తప్పడం లేదు. కాకినాడ నుంచి బయలుదేరే సర్కారు మినహా చెన్నై వెళ్లేందుకు ఈ ప్రాంతం నుంచి బయలుదేరే(ఆరిజిన్ పాయింట్) రైలు లేదు. బెంగళూరు, కోల్‌కతా, అటు ఉత్తర భారతం, ఇటు ఈశాన్య రాష్ట్రాలు వెళ్లాలంటే రిజర్వేషన్లు దొరకని పరిస్థితి. దీంతో చాలా మంది జనరల్ బోగీలను ఆశ్రయిస్తారు.
జనరల్ ఎక్కితే అంతే..
రాజమహేంద్రవరం నుంచి విశాఖ, విజయవాడ వెళ్లడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో సాధారణ బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి. పశ్చిమ బంగ్లా, జార్ఖండ్, ఒడిశా, బిహార్, ఉత్తరాఖండ్, అసోం, ఈశాన్య రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు ఉపాధి కోసం నిర్మాణ తదితర పనులకు తండోపతండాలుగా ప్రజలు వస్తుంటారు. వీళ్లకు సరిపడా రైళ్లు లేవు. దీంతో జనరల్ బోగీల్లో నాలుగైదు రోజులు ప్రయాణం చేస్తుంటారు. జనరల్ బోగీలో సాధారణంగా 50 సీట్లు ఉంటాయి. మరో 30 మంది వరకూ ఎక్కినా సౌకర్యం గానే ఉంటుంది. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఒక్కో సాధారణ బోగీలో 300 మంది వరకూ ఉంటారు. పైగా ఒక్కో రైలుకు కేవలం రెండు సాధారణ బోగీలు మాత్రమే ఉండడం మరీ దారుణమని ప్రయాణికులు వాపోతున్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో సాధారణ బోగీలో ప్రయాణాలు సాగించే బడుగు వర్గాల ప్రజలే ఎక్కువగా మృత్యువాత పడ్డారు. దీనికి కిక్కిరిసి ప్రయాణాలు సాగించాల్సి రావడమే ప్రధాన కారణం. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ల సంఖ్య పెంచితే సాధారణ, రిజర్వేషను బోగీలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ రైళ్ల వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ల రద్దీ కాస్త తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ అక్కడి నుంచి విశాఖ.. ఇలా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఇంకా వేయాల్సిన అవసరం ఉంది.
ఇదో గుణపాఠం
రిజర్వేషను చేయించుకునే సమయంలో రైలులో ప్రయాణించేవారి ఫోన్ నెంబరు, అడ్రసు మాత్రమే ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఆన్‌లైన్ రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయి. ఆన్‌లైన్ రిజర్వేషన్లలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తోంది.. రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికుల చిరునామాకు రైల్వే అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అటు ప్రయాణికులకు కూడా నష్టపరిహారం, వైద్య సహాయం వంటివి అందడంలో ఇబ్బంది అవుతోంది. ఈ విషయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం ఓ గుణపాఠమని చెప్పవచ్చు. రిజర్వేషను చేయించుకున్న ప్రయాణికుల విషయంలో వారి చిరునామా, ఆచూకీ కోసం అధికారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దొరకని ఆ నలుగురి ఆచూకీ
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరం వరకూ రిజర్వేషను చేయించుకున్న 27 మందిలో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్లు కలవడం లేదు. ప్రమాదానికి గురైన రైలులో చనిపోయిన చెన్నై వైపు వారి మృతదేహాలను రైలు నెం.13683లో చెన్నై తరలించారు.
Updated Date - 2023-06-05T19:00:11+05:30 IST