భార్యపై అనుమానం.. కూతురు ఇంట్లో ఉండగా.. లోపలికి వెళ్లిన భర్త.. చివరకు..
ABN, First Publish Date - 2023-02-17T21:38:06+05:30
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలోని సొట్టవానిపేటలో శుక్రవారం ఘోరం జరిగింది. అనుమానంతో భార్యపై వ్యక్తి కత్తితో దాడిచేశాడు.
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలోని సొట్టవానిపేటలో శుక్రవారం ఘోరం జరిగింది. అనుమానంతో భార్యపై వ్యక్తి కత్తితో దాడిచేశాడు. అడ్డువచ్చిన కుమార్తెను నరికి చంపాడు. గత కొన్నాళ్లుగా కొలుసు రామారావు, సూర్యం దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. రామారావుకు 60 సంవత్సరాలకుపైగా వయసు ఉంటుంది. సూర్యంకు 50 ఏళ్లు దాటుతోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు అప్పన్న, పెద్ద కుమార్తె పున్నమ్మలకు వివాహమైంది. చిన్న కుమార్తె విజయ, కుమారుడు రాంబాబులకు వివాహం జరగాల్సి ఉంది. వీరిది ఉమ్మడి కుటుంబం. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు కుమారులు బయటికి వెళ్లిపోయారు. ఇంట్లో భార్య సూర్యం, చిన్న కుమార్తె విజయ, కోడలు భారతి, ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆ సమయంలో దంపతులు రామారావు, సూర్యం మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రామారావు కత్తితో భార్య సూర్యంపై దాడిచేశాడు. అడ్డుకున్న చిన్నకుమార్తె విజయను నరికాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బాత్‌రూమ్‌లో ఉన్న కోడలు భారతి బయటకు వచ్చి చూసేసరికి అత్త, ఆడపడుచు రక్తపుమడుగులో పడి ఉన్నారు. భయంతో ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి బయటకు వచ్చి భారతి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడకు చేరుకున్నారు. రామారావు అక్కడ నుంచి పరారీకాగా.. కొన ఊపిరితో ఉన్న సూర్యంను హుటాహుటిన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. సూర్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-02-17T21:38:07+05:30 IST