AP News: నన్నయ్య మహాభారతానికి వెయ్యేళ్లు.. విజయవాడలో శోభాయాత్ర
ABN, First Publish Date - 2023-08-22T10:07:17+05:30
ఆదికవి నన్నయ్య తెలుగులో రచించిన మహాభారతానికి వెయ్యేళ్లు అయిన సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించారు.
విజయవాడ: ఆదికవి నన్నయ్య తెలుగులో రచించిన మహాభారతానికి వెయ్యేళ్లు అయిన సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. వెయ్యి మంది విద్యార్దులతో సాగిన యాత్రలో కలెక్టర్ ఢిల్లీ రావు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. నన్నయ్య మహాభారతాన్ని రచించిన రోజు, రాజరాజనరేంద్రునికి పట్టాభిషేకం చేసిన రోజు ఈరోజు అని అన్నారు. వెయ్యేళ్లు అయిన సందర్భంగా వెయ్యి మంది విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. మహాభారత పల్లకి, గ్రంధాల సమర్పణ ద్వారా నేటి తరం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మహాభారతం గ్రంధాన్ని ప్రతిఒక్కరూ చదవాలని, నన్నయ్య, రాజరాజనరేంద్రుని గొప్పతనం గురించి తెలుసుకోవాలని అన్నారు. సాయంత్రం జరిగే సభకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అతిధిగా వస్తున్నారని తెలిపారు. రెండు వేల మంది విద్యార్థులు ఒకేసారి నన్నయ్య రాసిన 108 పద్యాలు పాడతారని అన్నారు. తెలుగు భాష చాణక్యుల నాటి నుంచి ఉన్న ప్రాచీన భాష అని చెప్పారు. నేడు పది కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి గ్రంధాలు చదవడం ద్వారా తెలుగు భాషపై పట్టు ఉంటుందన్నారు. చదువుతో పాటు మన చరిత్ర, భాషా వైభవం కూడా అందరూ తెలుసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-08-22T10:07:17+05:30 IST