TTD: భక్తుల నడ్డి విరుస్తున్న టీటీడీ
ABN, First Publish Date - 2023-01-21T20:13:07+05:30
దేశ విదేశాల నుంచీ అపారమైన భక్తి విశ్వాసాలతో తిరుమలకు తరలి వస్తున్న వడ్డికాసుల వాడి భక్తుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
తిరుపతి: దేశ విదేశాల నుంచీ అపారమైన భక్తి విశ్వాసాలతో తిరుమలకు తరలి వస్తున్న వడ్డికాసుల వాడి భక్తుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అలిపిరి టోల్‌గేట్ (Alipiri Tollgate)లో వాహనాలకు వసూలు చేసే ఛార్జీల నుంచీ శ్రీవారి సేవలు, ప్రసాదాల దాకా ధరలు అమాంతం పెంచేసింది. కల్యాణ మండపాలు మొదలుకుని భక్తులు (Devotees) బస చేసే గదుల వరకూ అన్నింటి అద్దెలూ గణనీయంగా ఎక్కువ చేసింది. కొన్నింటి ధరలు పెంచడంతో పాటు అదివరకూ కల్పిస్తున్న పలు సదుపాయాలనూ కోత వేసింది. కొన్నింటి ధరలు స్వల్పంగా తగ్గించినా అదే మోతాదులో సదుపాయాలనూ తగ్గంచింది. గత మూడేళ్ళుగా టీటీడీ (TTD) పలు అంశాల్లో ధరలు, అద్దెలు పెంచడంతో భక్తులపై భారం పెరిగిపోయింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు చివరికి తిరుచానూరు అమ్మవారి ఆలయంలోనూ భక్తులకు ధరల పోటు తప్పడం లేదు. ఆదాయం గణనీయంగా పెరిగిపోయిందని, టీటీడీ ఉన్నతాధికారులు పదేపదే ప్రకటనలు జారీ చేస్తున్న నేపథ్యంలో ధరలు, అద్దెలు పెంచాల్సిన అవసరమేమిటన్నది సామాన్య భక్తుని ప్రశ్న.
గదుల అద్దె పెంపుతోనే భక్తులపై తొలి దెబ్బ
టీటీడీ గత మూడేళ్ళలో భక్తులపై భారం మోపేలా తీసుకున్న నిర్ణయాల్లో మొదటిది గదుల అద్దె పెంపు. తద్వారా భక్తులపై తొలి దెబ్బ పడింది. 2019 నవంబరులో రూ. 500గా ఉన్న పాంచజన్యం, కౌస్తుభం గదుల అద్దెను, అలాగే రూ. 600గా ఉన్న నందకం గదుల అద్దెను ఏకంగా రూ. వెయ్యికి పెంచారు. ఈ మూడు భవన సముదాయాల్లో ఉన్న 951 గదుల అద్దెను ఇలా దాదాపు రెట్టింపు చేశారు. 2020 సెప్టెంబరు 10వ తేదీ నుంచీ రూ. వెయ్యిగా ఉన్న 120 ఏసీ గదుల అద్దెను రూ. 1500 చేశారు. ఈనెల 1వ తేదీ నుంచీ నారాయణగిరి 1, 2, 3 సముదాయాల్లో రూ. 150గా ఉన్న గదుల అద్దె ఒకేసారి రూ. 1700కు పెంచేశారు. నారాయణగిరి 4వ సముదాయంలో రూ. 750గా ఉన్న గదుల అద్దెను కూడా రూ. 1700కు పెంచారు. వాటిలోనే రూ. 200గా ఉన్న పెద్ద గదుల అద్దెను ఏకంగా రూ. 2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల అద్దెను సైతం రూ. 750 నుంచీ రూ. 2200కు, కొన్ని కార్నర్ సూట్లు రూ. 1500 నుంచీ రూ. 2800కు వంతున పెంచేశారు. ఇక వివిజీహెచ్ గదుల అద్దె రూ. 1500 నుంచీ రూ. 2200కు పెంచారు. వీటిల్లో సామాన్య, మధ్య తరగతికి చెందిన భక్తులే ఎక్కువగా దిగుతుంటారు. గదుల ఆధునీకరణ పేరిట, ఏసీ, గీజర్ వంటి సదుపాయాల కల్పన పేరిట అద్దెలు పెంచేశారు.
ఆదాయం పెరిగినా ఇదేం తీరు?
టీటీడీ ఆదాయం ఏయేటికా ఏడు పెరుగుతూనే వస్తోంది. కేవలం 2020, 2021లలో మాత్రమే కొవిడ్ కారణంగా ఆదాయం తగ్గింది. అయితే ఆ కాలంలో టీటీడీకి ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఇక కొవిడ్ ఆంక్షలు పూర్తిస్థాయిలో తొలిగాక శ్రీవారి ఆలయ ఆదాయం మునుపటితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2022లో కేవలం హుండీ ఆదాయం మాత్రమే రూ. 1450 కోట్లు వచ్చింది. ఒక ఏడాది కాలంలో ఇంత భారీ ఎత్తున హుండీ ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఆదాయం ఇంతలా ఉన్నపుడు టోల్ గేట్ ఫీజులు, గదుల అద్దెలు, కళ్యాణ మండపాల అద్దెలు, లడ్డూ ప్రసాదాల ధరలు పెంచడం, ప్రసాదాల్లో కోతలు విధించడం, తిరుచానూరులో సేవల ధరలు పెంచడం, కొన్నింటిలో కోత విధించడం వంటివి ఎందుకున్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదాయం పెరిగినపుడు భక్తులకు మరిన్ని సదుపాయాలను పెంచాల్సిందిపోయి ధరలు పెంచి, కేటాయింపుల్లో కోతలు విధించడం పట్ల దేవస్థానం వ్యాపార ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలకు, ప్రచారానికి తావిస్తోంది. మూడేళ్ళ కాలంలో టీటీడీ తీసుకున్న పలు నిర్ణయాలు భక్తులపై భారం మోపి వారి నడ్డి విరిచేలా ఉన్నాయన్న ఆరోపణల్లో చాలావరకూ వాస్తవాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. మొత్తానికీ దీనివల్ల శ్రీవారి భక్తుల్లో దేవస్థానంలో అసంతృప్తి ప్రబలుతోందనే చెప్పాలి.
Updated Date - 2023-01-21T20:13:09+05:30 IST