Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆఖరి రోజుకు శాకాంబరి ఉత్సవాలు
ABN, First Publish Date - 2023-07-03T09:27:40+05:30
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆఖరిరోజుకు చేరుకున్నాయి.
విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆఖరిరోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు శాకాంబరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వివిధ రకాల పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారి దర్శనభాగ్యం కలిగింది. ఈరోజు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో శాకాంబరీ దేవి ఉత్సవాలు ముగియున్నాయి. అమ్మవారి మూల విరాట్‌ను పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చకస్వాములు అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా అధికారులు ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని చేసి.. భక్తులకు అందించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
Updated Date - 2023-07-03T09:27:40+05:30 IST