RI Swarna Latha: స్వర్ణలత కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనట..!
ABN, First Publish Date - 2023-07-12T18:10:33+05:30
నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రిజర్వు ఇన్‌స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో ఆర్‌ఐ స్వర్ణలత గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమవర్మ స్వయంగా విలేకరుల సమావేశంలో వివరించారు.
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): నోట్ల మార్పిడి పేరుతో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి రిజర్వు ఇన్‌స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ దోపిడికీ పాల్పడిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో ఆర్‌ఐ స్వర్ణలత గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమవర్మ స్వయంగా విలేకరుల సమావేశంలో వివరించారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన విజ్జన సూరిబాబు, హోంగార్డు వంటకు శ్రీనివాసరావు, ఆర్‌ఐ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మహంతి హేమసుందరరావు అలియాస్ మెహర్, ఆర్‌ఐ స్వర్ణలత కలిసి నేవీ విశ్రాంత అధికారులను బెదిరించి తీసుకున్న రూ.12.1 లక్షలను వారి నుంచి రికవరీ చేసినట్టు సీపీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే నోట్ల మార్పిడికి విశ్రాంత నేవీ అధికారులు ఎంత మొత్తం తీసుకువచ్చారు?, ఆర్‌ఐ స్వర్ణలత గ్యాంగ్ రూ.రెండు వేల నోట్లను తీసుకువెళ్లారా?, లేదా? అనే విషయం ప్రస్తావన లేకుండా ఆయన విలేకరుల సమావేశం ముగించారు. దాంతో ఈ వ్యవహారంపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఆర్‌ఐ స్వర్ణలత గ్యాంగ్ రూ.కోటి విలువైన రూ.రెండు వేల నోట్లను తీసుకువెళ్లారని, విశ్రాంత నేవీ అధికారులు రూ.90 లక్షలు విలువైన రూ.500 నోట్లు తెచ్చారని ప్రచారం జరిగింది.
నోట్ల మార్పిడికి రూ.90 లక్షల విలువ చేసే రూ.500 నోట్లు తీసుకువచ్చిన విశ్రాంత నేవీ అధికారులను ఆర్‌ఐ స్వర్ణలత రాత్రి పెట్రోలింగ్ పేరుతో అక్కడకు చేరుకుని అంత మొత్తం ఎలా వచ్చిందని, దానికి లెక్కలు చూపించాలని లేకపోతే టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించి కేసు నమోదు చేయిస్తానని బెదిరించి రూ.12.1 లక్షలు గుంజేసి, మిగిలిన మొత్తాన్ని వారికి వెనక్కి ఇచ్చి పంపినట్టు మరో కథనం ఉంది. ఏదేమైనా ఆర్‌ఐ స్వర్ణలతను కేసు నుంచి తప్పించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో పోలీసులు కేసు తీవ్రతను తగ్గించేందుకు వీలుగా లావాదేవీల సమయంలో ఉన్న మొత్తాన్ని తగ్గించి చూపించినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో పోలీసులు ఈ నెల ఏడున కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. కేసు తీవ్రత తగ్గించేందుకు యత్నించారనే ఆరోపణలకు ఆ రిపోర్టు బలాన్ని చేకూర్చింది.
నోట్ల మార్పిడి కోసం విశ్రాంత నేవీ అధికారులు తీసుకువెళ్లిందే రూ.12 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లు అని, ఆ మొత్తాన్నే స్వర్ణలత గ్యాంగ్ బెదిరించి తీసుకుందని, ఆర్‌ఐ స్వర్ణలత, సూరిబాబు రూ.ఐదేసి లక్షలు చొప్పున, హోంగార్డు శ్రీనివాసరావు రూ.రెండు లక్షలు వాటాలుగా పంచేసుకోగా, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్‌కు వాటా దక్కకపోవడంతో నేవీ విశ్రాంత అధికారి కొల్లి శ్రీను తన ఫోన్ పే ద్వారా రూ.పది వేలు అతడికి పంపించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రూ.12 లక్షలు నగదు మాత్రమే పోలీసులకు దొరికినట్టయితే, అది కూడా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తం అయినప్పుడు పోలీసులకు ముగ్గురు నేవీ విశ్రాంత అధికారులు ఎందుకు భయపడ్డారు?...అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. కేవలం ఆర్‌ఐ స్వర్ణలతను తీవ్రమైన శిక్ష నుంచి తప్పించేందుకే పోలీసులు నగదు మొత్తాన్ని బాగా తగ్గించి చూపించారని పేర్కొంటున్నారు. అసలు నోట్ల మార్పిడికి రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లు తీసుకువెళ్లారా? లేదా?...తీసుకువెళితే అవి ఎవరివి?...అనే అంశాల ప్రస్తావన రిమాండ్ రిపోర్టులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated Date - 2023-07-12T18:12:20+05:30 IST