ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CHANDRABABU: ఇదేనా చిత్తశుద్ధి!

ABN, First Publish Date - 2023-04-11T02:00:35+05:30

‘అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తే... దానిని మోసం అంటారు!’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భోగాపురం విమానాశ్రయంపై నాలుగేళ్లు నిద్ర

ఇప్పుడు శంకుస్థాపన పేరిట హడావుడి

2019 ఫిబ్రవరిలో చంద్రబాబు శంకుస్థాపన

నాడు భూసేకరణకు వ్యతిరేకంగా జగన్‌ పోరు

తాము భూములు తిరిగిస్తామని హామీ

సీఎం కాగానే సీన్‌ మొత్తం రివర్స్‌

జీఎంఆర్‌తో ఒప్పందం తిరగదోడిన వైనం

‘సొంత’లాభం చూసుకున్నాకే క్లియరెన్స్‌?

500 ఎకరాలకు కోతతో తగ్గిన ప్రాధాన్యం

(విశాఖపట్నం/విజయనగరం - ఆంధ్రజ్యోతి): ‘అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తే... దానిని మోసం అంటారు!’... ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా చెప్పిన మాట! అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు ఏం చేశారో తెలియదుగానీ... ఎన్నికలు ఏడాది ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీన టెంకాయ కొట్టి... రెండున్నరేళ్లలోనే పనులు పూర్తి చేస్తామంటున్నారు. నాలుగేళ్లు నాన్చి, ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన పేరిట హడావుడి చేస్తున్నారు.

‘రివర్స్‌’కు బలి...

టీడీపీకి చెందిన అశోక్‌ గజపతిరాజు పౌర విమానయాన మంత్రిగా ఉండగా... భోగాపురం విమానాశ్రయం మంజూరైంది. దీని నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈపాటికి అది పూర్తయిపోయి విమానాల రాకపోకలు ప్రారంభం కావాల్సింది. కానీ... జగన్‌ సీఎం కాగానే సీన్‌ మారిపోయింది. ‘రివర్స్‌’ అంటూ ఈ ఒప్పందాన్ని కూడా తిరగదోడారు. కాంట్రాక్టు దక్కించుకున్న జీఎంఆర్‌ గ్రూపుతో చర్చలు జరిపి.. కాకినాడలో సెజ్‌తో లింకు పెట్టి... అక్కడ కొంత ప్రయోజనం పొందాకే ఇక్కడ ఈ కాంట్రాక్టు మళ్లీ ఇవ్వడానికి అంగీకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈలోగా వివాదాలు ముసురుకున్నాయి. నష్ట పరిహారం చాలదంటూ కొందరు రైతులు కోర్టుకు వెళ్లారు. విమానాశ్రయం పరిసరాల్లో జరగబోయే అభివృద్ధిని ఊహించిన ప్రభుత్వ పెద్దలు ప్లాన్‌ మార్చారు. విమానాశ్రయం కోసం సేకరించిన భూముల్లో భవిష్యత్తు అవసరాల పేరుతో 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. మొత్తం 2,700 ఎకరాలు సేకరించగా... జీఎంఆర్‌కు 2200 ఎకరాలే ఇస్తామన్నారు. దాంతో ఆ సంస్థ కూడా రివర్స్‌ గేర్‌ వేసింది. ‘‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సేకరించిన 2,700 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ (మెయింటెనెన్స్‌-ఎం), మరమ్మతులు (రిపేర్లు-ఆర్‌), ఓవర్‌ హాలింగ్‌(ఓ) ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పుడు 500 ఎకరాలు తగ్గిస్తే ఎంఆర్‌వో పెట్టలేం’’ అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇలా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం డీపీఆర్‌ మారిపోయింది. విమానాశ్రయానికి అనుబంధ యూనిట్లు, శిక్షణ, పరిశోధన కేంద్రం వంటివి అటకెక్కాయి. విమానాశ్రయమే మిగిలింది.

రాయల్టీ ఏమైంది?

భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖలో ప్రస్తుత విమానాశ్రయాన్ని మూసివేయాలి. దీనిపై భారత విమాన సంస్థ (ఏఏఐ) నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘విశాఖలో విమానాశ్రయం కోసం మేం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. విశాఖ నుంచి ఏటా 20 లక్షల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయం మూసివేత వల్ల మేం కోల్పోయే నష్టాన్ని కొంత రాయల్టీ రూపంలో చెల్లించాలి. ఇందుకు అంగీకరిస్తేనే ఎన్‌వోసీ ఇస్తాం’’ అని ఏఏఐ మెలిక పెట్టింది. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాల్సిన ప్రభుత్వం... ఘర్షణ వైఖరి ప్రదర్శించింది. ‘‘విశాఖ విమానాశ్రయం నిర్మాణానికి వివిధ దశల్లో ఇచ్చిన 74 ఎకరాల భూమి వెనక్కి ఇచ్చేయండి’’ అని కోరింది. ఈ వివాదం ఏమైందో తెలియదు. ఏ రకమైన ఒప్పందం జరిగిందో ఇరువర్గాలు బయట పెట్టలేదు. ఇప్పుడు శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాశ్రయ భూముల వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకం దర్శనమిస్తూనే ఉంది. ఇప్పుడు... మళ్లీ అదే విమానాశ్రయానికి జగన్‌ శంకుస్థాపన చేస్తారట! విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. అప్పుడు విపక్ష నేత హోదాలో ఉన్న జగన్‌ దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. గద్దెనెక్కగానే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని గూడెపువలసలో ప్రకటించారు. ఇప్పుడు ప్లేటు మొత్తం తిరగేసి... అవే భూముల్లో మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారు.

Updated Date - 2023-04-11T03:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising